ఆమె జీవితంలోని బంధాలన్నీ తన వల్లే బ్రేకప్ అవ్వాలంటున్న షాహిద్ కపూర్
సాధారణ ప్రేక్షకులకు అభిమాన హీరోలు, అభిమాన హీరోయిన్లు ఉన్నట్టే సినిమా సెలబ్రిటీస్‌కి కూడా అభిమాన తారలు ఉంటారు. అయితే కొంతమంది తమ అభిమాన తార గురించి పదే పదే ప్రస్తావిస్తారు. మరికొందరు సందర్భం వచ్చినపుడు మాత్రమే చెప్తారు. అలాంటి వారిలో రామ్‌గోపాల్‌వర్మ ఒకరు. దాదాపు ప్రతి ఇంటర్వ్యూలోనూ అతని అభిమాన తార గురించి అడుగుతారు. తను ఎక్కువగా అభిమానించే హీరోయిన్ శ్రీదేవి అని అతను కూడా చెప్తాడు. అయితే అందరి కంటే ఆమె గురించి కాస్త ఎక్కువగానే చెప్తాడు. ఎందుకంటే ఆమెతో రెండు సినిమాలు చేసాడు కదా. ఇప్పుడు వర్మ, శ్రీదేవి విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే… వర్మలాగే మరో వీరాభిమాని బాలీవుడ్లో ఉన్నాడు. అయితే అతను అభిమానించేది శ్రీదేవిని కాదు హాలీవుడ్ హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్‌ని. తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన `అర్జున్‌రెడ్డి` చిత్రాన్ని హిందీలో `కబీర్‌సింగ్`గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిందీలోనూ సూపర్‌హిట్ అయింది. ఈ సినిమాలో కబీర్‌సింగ్‌గా నటించిన షాహిద్ కపూర్ నిజజీవితంలోనూ ఆ క్యారెక్టర్లాగే మాట్లాడుతుంటాడు. అతనికి హాలీవుడ్ హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ అంటే వల్లమాలిన ప్రేమ. అందరికీ హీరోయిన్లంటే అభిమానం ఉంటుంది. కానీ, ఇతనికి ఆమె అంటే ప్రేమ. షాహిద్ ఇండస్ట్రీతో సంబంధంలేని మీరా రాజ్‌పుత్‌ను పెళ్లి చేసుకున్నాడు.
అయితే మీరా కంటే తనకు స్కార్లెట్ మీదే ఎక్కువ ప్రేమ అని చెప్తుంటాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు అందరూ ఆశ్చర్యపోయే సమాధానమిచ్చాడు. `నీకు అదృశ్యమయ్యే శక్తి వస్తే.. నువ్వు కనిపించకుండా ఎవరు స్నానం చేస్తుంటే చూడాలని కోరుకుంటావు?` అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ `ఇంకెవరు.. స్కార్లెట్ జాన్సన్ స్నానం చేస్తుంటే చూడాలనుకుంటాను` అంటూ సమాధానమిచ్చాడు. ఆ ఇంటర్వ్యూలోనే కాదు, కొన్ని ఫంక్షన్స్‌లో కూడా స్కార్లెట్‌పై తనకున్న ప్రేమను వెలిబుచ్చాడు షాహిద్. కరణ్ జోహర్ చేసిన మరో ఇంటర్య్వూలో `నీ గురించి ఏ రూమర్ వస్తే బాగా ఎంజాయ్ చేస్తావు?` అని అడిగిన ప్రశ్నకు `నా కారణంగా స్కార్లెట్ తన భర్తతో విడిపోయిందన్న రూమర్ వస్తే బాగా ఎంజాయ్ చేస్తాను` అంటూ సమాధానమిచ్చాడు. ఆ తర్వాత మరికాస్త ముందుకెళ్లి `స్కార్లెట్ జీవితంలోని బంధాలన్నీ నా వల్లే బ్రేకప్ అవ్వాలి` అన్నాడు. ఆడియన్స్‌లో ఎంతో మంది వీరాభిమానుల్ని చూశాం. కానీ, ఇలాంటి వీరాభిమానం గురించి మనం ఎక్కడా వినలేదు కదూ. అయితే స్కార్లెట్ స్టార్ అవ్వకముందు నుంచే ఆమెను ఆరాధిస్తున్నానని షాహిద్ చెప్పడం విశేషం.













