శ్రీకాంత్ సినిమాలో హీరోయిన్ గురించి క్లూ ఇచ్చిన నాని
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కలయికలో వచ్చిన దసరా సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అంతకుముందు వరకు నానికి కేవలం క్లాస్ హీరోగానే పేరుంది. దసరా సినిమాతో తను మాస్ సినిమాలు కూడా చేయగలడని ప్రూవ్ చేశాడు. అంతేకాదు దసరా సినిమాతో నాని మొదటిసారి రూ.100 కోట్ల మార్కెట్ ను అందుకున్నాడు.
ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనున్న నాని, తర్వాతి సినిమాను శ్రీకాంత్ ఓదెల తో చేయనున్న విషయం తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన దసరా హిట్ అవడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తైనట్లు సమాచారం.
త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కోసం దసరా టీమ్ నే మరోసారి రిపీట్ చేస్తారని టాక్. డైరెక్టర్ హీరో తో పాటూ నిర్మాత కూడా దసరా నిర్మాతే కాబట్టి హీరోయిన్ ను కూడా కీర్తి సురేష్ ని తీసుకుంటారంటున్నారు. నాని కూడా దసరా కాంబో మళ్లీ రిపీటవుతుందని హీరోయిన్ విషయంలో క్లూ ఇచ్చాడు. దీంతో మరోసారి నానితో కీర్తి కలిసి నటించనుందని అర్థమవుతుంది. ఇప్పటికే నేను లోకల్, దసరా సినిమాలతో మంచి హిట్లు అందుకున్న ఈ జోడీ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.













