Mithra Mandali: ఘనంగా ‘మిత్ర మండలి’ ట్రైలర్ ఆవిష్కరణ

ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్థాపించిన బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’ (Mithra Mandali). సోమరాజు పెన్మెత్స సహ నిర్మాత. ఈ వినోదభరిత చిత్రానికి నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓఐ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెండితెరపై నవ్వుల టపాసులు పేల్చడానికి, దీపావళి కానుకగా అక్టోబర్ 16న ‘మిత్ర మండలి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, మూడు పాటలు విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ ట్రైలర్ వచ్చింది.
హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో ‘మిత్ర మండలి’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ‘లిటిల్ హార్ట్స్’ చిత్ర బృందం ఈ వేడుకలో పాల్గొని, ట్రైలర్ ఆవిష్కరణ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘మిత్ర మండలి’ ట్రైలర్ నవ్వులతో నిండిన ప్రయాణాన్ని సూచిస్తుంది. విచిత్రమైన పాత్రలు మరియు కడుపుబ్బా నవ్వించే హాస్యంతో తక్షణమే ఈ ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రధాన పాత్రధారులు ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓఐ, రాగ్ మయూర్ మరియు ప్రసాద్ బెహరా వింతైన పరిస్థితుల్లో చిక్కుకున్న విచిత్రమైన వ్యక్తులుగా కనిపిస్తున్నారు. వారి మాటలు, చేష్టలు నవ్వుల జల్లు కురిపిస్తున్నాయి.
అతిశయోక్తి పరిస్థితులు మొదలు, మీమ్స్ కు తగిన క్షణాల నుండి తెలివైన మీమ్ రిఫరెన్స్ ల వరకు, ట్రైలర్ గందరగోళం మరియు హాస్యం మేళవింపుతో ఆద్యంతం వినోదభరితంగా సాగింది. ప్రియదర్శి మరోసారి ప్రేక్షకుల మెచ్చే పాత్రలో కనిపించగా, విష్ణు ఓఐ మరియు ప్రసాద్ బెహరా తమదైన హాస్యంతో ఆకట్టుకున్నారు. ఒక విచిత్రమైన పోలీసు పాత్రలో వెన్నెల కిషోర్, ముఖ్యమైన పాత్ర సత్య, సరదా అతిథి పాత్రలో అనుదీప్ కె.వి. కనిపిస్తున్నారు. ఈ తమదైన ప్రత్యేక శైలి హాస్యంతో వీరు వినోదాన్ని రెట్టింపు చేశారు.
‘మిత్ర మండలి’ చిత్రం హాస్యం, యువత అల్లరి మరియు రహస్యాన్ని సమాన స్థాయిలో మిళితం చేసినట్లు కనిపిస్తుంది. అద్భుతమైన విజువల్స్, ఆకర్షణీయమైన సంభాషణలు మరియు అంతటా సరికొత్త వినోదాన్ని పంచుతూ, ఒక పరిపూర్ణ దీపావళి ఎంటర్‌టైనర్‌గా ‘మిత్రమండలి’ రూపుదిద్దుకుంటున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తుంది.
‘మిత్ర మండలి’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో చిత్ర కథానాయకుడు ప్రియదర్శి మాట్లాడుతూ.. “థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులు సంతోషంగా నవ్వుకొని బయటకు వెళ్ళాలనే ఉద్దేశంతో ‘మిత్ర మండలి’ సినిమా చేశాము. జాతిరత్నాలకు రెట్టింపు నవ్వులు పంచి, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాము. నలుగురు స్నేహితులు కూర్చొని, సరదాగా మాట్లాడుకుంటే ఎలాంటి ఆనందం కలుగుతుందో.. అలాంటి ఆనందాన్ని ఈ సినిమా కలిగిస్తుంది.” అన్నారు.
చిత్ర కథానాయిక నిహారిక ఎన్ఎమ్ మాట్లాడుతూ.. “మిత్ర మండలి కథ వినగానే.. ఈ కథ నాకు సరిగ్గా సరిపోతుంది, ఈ సినిమా ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను. నా పాత్రకు చాలా ప్రాధాన్యముంటుంది. మొదటి సినిమాలోనే ఇంత మంచి పాత్ర రావడం సంతోషంగా ఉంది.” అన్నారు
చిత్ర సమర్పకులు బన్నీ వాస్ మాట్లాడుతూ.. “మూడు నెలల క్రితం ‘లిటిల్ హార్ట్స్’ టీమ్ తమ సినిమాని విడుదల చేయమని నా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ కోసం నేను వాళ్ళని పిలిచాను. ఇది నిజమైన విజయం అంటే. ‘లిటిల్ హార్ట్స్’ టీమ్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ‘మిత్ర మండలి’ చాలా మంచి కథ. నాకు బాగా నచ్చిన కథ. ఈ సినిమా అందరినీ నవ్విస్తుంది. అక్టోబర్ 11న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఈ సినిమా కోసం దర్శకులు అనుదీప్, ఆదిత్య హాసన్, కళ్యాణ్ చేసిన సహాయాన్ని మరచిపోలేము.” అన్నారు.
దర్శకుడు, నిర్మాత ఆదిత్య హాసన్ మాట్లాడుతూ.. “నేను మిత్ర మండలి సినిమా చూశాను. చాలా బాగుంటుంది. సినిమాలో సోషల్ సెటైర్ ఉంటుంది. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు ఫుల్ ఫన్ ఉంటుంది. అన్ని పాత్రలు మీకు నచ్చుతాయి. ప్రియదర్శి గారు ఎందరో కొత్త వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. బన్నీ వాసు గారి ఖాతాలో మరో విజయం వచ్చి చేరుతుందని నమ్ముతున్నాను. విజయ్ మంచి దర్శకుడు. అక్టోబర్ 16న విడుదలవుతున్న ‘మిత్ర మండలి’ని ఆదరించాలని కోరుకుంటున్నాను.” అన్నారు.
కథానాయకుడు మౌళి మాట్లాడుతూ.. “మిత్ర మండలి ట్రైలర్ చాలా బాగుంది. ప్రియదర్శి గారు, నిహారిక గారు, విష్ణు గారు, రాగ్ మయూర్ గారు, ప్రసాద్ గారు వీళ్ళందరూ నాకు స్ఫూర్తే. అందరూ సొంతంగా వచ్చి ఎదిగినవారే. వాళ్ళు నటించిన సినిమా ఈవెంట్ కి రావడం సంతోషంగా ఉంది. మమ్మల్ని పిలిచినందుకు బన్నీ వాసు గారికి థాంక్స్. అందరూ మిత్ర మండలి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు.
దర్శకుడు సాయి మార్తాండ్ మాట్లాడుతూ.. “ట్రైలర్ నాకు చాలా నచ్చింది. విజయేందర్ గారు కామెడీ బాగా రాస్తారని నాకు చాలామంది చెప్పారు. ఇప్పుడు ట్రైలర్ లో చూశాను. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను.” అన్నారు.
సంగీత దర్శకుడు సింజిత్ యర్రమిల్లి మాట్లాడుతూ.. “ఈ టీమ్ అందరితో నాకు మంచి అనుబంధం ఉంది. లిటిల్ హార్ట్స్ తరహాలోనే ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను.” అన్నారు.
నటుడు జయకృష్ణ మాట్లాడుతూ.. “ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ చూస్తుంటే, ఇంత మంచి సినిమాలో నేను కూడా భాగమైతే బాగుండేది అనిపిస్తుంది.” అన్నారు.
ట్రైలర్ ఆవిష్కరణ అనంతరం ‘మిత్రమండలి’ చిత్ర బృందం, పాత్రికేయులతో ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అక్టోబర్ 16న థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించనున్న ‘మిత్రమండలి’ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రాహకుడిగా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్ గా పీకే, కళా దర్శకుడిగా గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా శిల్పా టంగుటూరు వ్యవహరిస్తున్నారు.