చిరూ ఎవరితో ముందు?
భోళా శంకర్ సినిమా రిజల్ట్ చూసిన చిరంజీవి, ఇకపై రీమేక్స్ జోలికి పోకూడదని నిర్ణయించుకుని కొత్త కథలపై ఫోకస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లతో సినిమాలు చేయాలని డిసైడయ్యాడు చిరూ. సుకుమార్, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్లతో చిరూ ఇప్పటికే ఈ విషయం కోసం టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
చిరూని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఏ డైరెక్టర్ మాత్రం కాదనుకుంటారు చెప్పండి. మెగాస్టార్, సుకుమార్ కాంబోలో సినిమాను నిర్మించడానికి అల్లు అరవింద్ రెడీగా ఉండగా, త్రివిక్రమ్ తో సినిమాను నిర్మించేందుకు డీవీవీ దానయ్య సిద్దమయ్యారని టాక్. ఇక దిల్ రాజు బ్యానర్ లో అనిల్ రావిపూడి సినిమా పట్టాలెక్కే ఛాన్సుందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ మూడింటిలో ముందుగా అనిల్ రావిపూడి సినిమానే ఉండొచ్చని తెలుస్తోంది. భగవంత్ కేసరి తర్వాత అనిల్ రావిపూడి చేసే సినిమా మెగాస్టార్ తోనే అనే టాక్ చాలా గట్టిగా వినిపిస్తోంది. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్, బన్నీతో సినిమాను చేయాల్సి ఉంది కాబట్టి ఆ తర్వాత మెగాస్టార్ తో సినిమా ఉండే ఛాన్సుంది.
ఇక సుకుమార్ పుష్ప2తో బిజీగా ఉన్నాడు. అది రిలీజయ్యాక కానీ సుకుమార్ తన నెక్ట్స్ సినిమా గురించి తెలియదు. గతంలో రామ్ చరణ్ తో మరో సినిమా చేస్తానని చెప్పిన సుకుమార్ కు ఇప్పట్లో చరణ్ డేట్స్ దొరికేలా కనిపించట్లేదు కాబట్టి చిరూతో ముందుకెళ్తాడేమో చూడాలి. ఈ మూడు కాంబినేషన్స్ లో సినిమాలు ఎప్పుడొస్తాయో కానీ వచ్చినప్పుడు మాత్రం బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయం.













