మంచి ఛాన్సులు మిస్ చేసుకుంటున్న మణిశర్మ
మణిశర్మ సంగీతం గురించి సినీ లవర్స్ కు కొత్తగా చెప్పనక్కర్లేదు. మెలోడీ బ్రహ్మగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఒకప్పుడు సీనియర్ నుంచి జూనియర్ హీరోల వరకు అందరికీ ఎవర్గ్రీన్ ఆల్బమ్స్ ఇచ్చాడు. మామూలు సినిమాలను కూడా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నిలబెట్టిన మణిశర్మ, మరికొన్ని సినిమాలకు తన రీరికార్డింగ్‌తో ప్రాణం పోశాడు.
ప్రస్తుతం టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ల కొరత చాలా ఎక్కువగా ఉంది. అందుకే కొత్తదనం కోసం వెతుక్కోవడం, లేదంటే ఫామ్ లో ఉన్న తమన్‌కే అన్ని అవకాశాలు ఇవ్వడంతో ఆయన మీద బాగా ఒత్తిడి పెరగడం జరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో మణిశర్మ ఫామ్ లో ఉండి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఇస్మార్ట్ శంకర్ తో కంబ్యాక్ ఇచ్చిన మణికి ఆ తర్వాత బాగానే ఛాన్సులొచ్చాయి. కానీ ఆయన నుంచి మాత్రం గొప్ప అవుట్‌పుట్ రాలేదు. ఆచార్య లాంటి సినిమాకు కూడా మామూలు సంగీతంతో మమ అనిపించడంతో మళ్లీ ఫేడవుట్ అయ్యాడు మణి. అలా కాకుండా ఇస్మార్ట్ శంకర్ తో వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకుని ఉంటే స్టార్ హీరోలందరూ మళ్లీ మణికే ఓటేసేవాళ్లు. ప్రస్తుతం ఆయన చేతిలో డబుల్ ఇస్మార్ట్ ఉంది. ఇస్మార్ట్ శంకర్ కంటే భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో అయినా మణి తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.













