Manchu Vishnu: కన్నప్ప వివాదంపై స్పందించిన మంచు విష్ణు

మంచు ఫ్యామిలీ ఎప్పుడూ ఏదోక వివాదంలో ఉంటూనే ఉంటుంది. మొన్నటి వరకు మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఏ రేంజ్ లో జరిగాయో అందరికీ తెలిసిందే. పర్సనల్ విషయాల్లోనే కాదు, సినిమాల విషయంలో కూడా మంచు ఫ్యామిలీ ఆల్రెడీ వివాదాలను ఎదుర్కొంది. గతంలో మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా వచ్చిన దేనికైనా రెడీ(Denikaina Ready) సినిమాలో బ్రాహ్మణులను కించపరిచేలా సీన్స్ ఉన్నాయని పెద్ద ఎత్తున రచ్చ జరిగిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీ తీసిన కన్నప్ప(Kannappa) సినిమా విషయంలో కూడా ఓ కొత్త వివాదం మొదలైంది. కన్నప్పలో బ్రాహ్మణులుగా నటించిన బ్రహ్మానందం(Brahmanandam), సప్తగిరి(Saptagiri) పాత్రలకు పిలక, గిలక అనే పేర్లు పెట్టడంపై బ్రాహ్మణ వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సినిమాలో వారి పాత్రలను తొలగించాలని, లేదంటే కన్నప్పను థియేటర్లలో ఆడనివ్వమని హెచ్చరిస్తున్నారు.
ఈ వివాదంపై తాజాగా మంచు విష్ణు స్పందించాడు. కన్నప్ప సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని, ఈ సినిమా ఎవరి మనోభావాలను దెబ్బ తీయదని, సినిమా స్క్రిప్ట్ దశలోనే ఎంతోమంది వేద పండితులు, ఆధ్యాత్మిక గురువుల సలహాలు, సూచనలు తీసుకున్నామని, సంప్రదాయాలను గౌరవిస్తూ పరమశివుడిని ఎంతో భక్తితో ఈ సినిమాలో చూపించామని, ప్రతీ రోజూ షూటింగ్ కు వెళ్లే ముందు కూడా భక్తితో శివుడిని పూజించి, వేద పండితులు ఆశీర్వచనం తీసుకున్నామని చెప్పాడు. ఈ సినిమా తీయడానికి గల ముఖ్య కారణం భక్తితత్వాన్ని వ్యాపింప చేయడమేనని, వివాదాల కోసం ఈ సినిమాను తీయలేదని, దయచేసి సినిమా రిలీజయ్యే వరకు అందరూ ఓపికతో ఉండాలని విష్ణు కోరాడు. ఆల్రెడీ కన్నప్ప సినిమాను శ్రీకాళహస్తి ఆలయ వేదపండితులకు చూపించామని, వారు సినిమాలోని ఏ సన్నివేశంపైనా అభ్యంతరం వ్యక్తం చేయలేదని, అలాంటప్పుడు తానెందుకు సినిమా నుంచి పాత్రలను తీసేయాలని విష్ణు ప్రశ్నించాడు.