Manchu Vishnu: కన్నప్పపై విష్ణు నెక్ట్స్ లెవెల్ నమ్మకం

విష్ణు(Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన కన్నప్ప(Kannappa) సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ స్టార్ క్యాస్టింగ్ తో వస్తున్న ఈ సినిమాపై విష్ణు ఎంతో నమ్మకంగా ఉన్నాడు. కన్నప్ప కచ్ఛితంగా హిట్ అవుతుందని నమ్ముతున్నాడు. కన్నప్ప సినిమా కోసం విష్ణు భారీ మొత్తంలో డబ్బుని ఖర్చు పెట్టడమే కాకుండా ఎన్నో ఏళ్ల కష్టాన్ని కూడా కన్నప్ప కోసం ధార పోశాడు.
ఈ మధ్య ఏ సినిమా అయినా ఎంతో ముందుగానే డిజిటల్ రైట్స్ ను అమ్మేస్తుంటే, కన్నప్ప రిలీజ్ దగ్గర పడుతున్నప్పటికీ ఇంకా ఓటీటీ డీల్స్ ను అమ్మలేదని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాకు వచ్చిన ఒక ఓటీటీ డీల్ ను విష్ణు రిజెక్ట్ చేసినట్టు వెల్లడించాడు. కన్నప్ప రిలీజయ్యాక డిజిటల్ రైట్స్ అమ్మాలని, అప్పుడే సినిమాకు ఎక్కువ రేటు వస్తుందని భావించి విష్ణు ఆ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది.
కన్నప్ప సినిమా డిజిటల్ రైట్స్ విషయంలో కొన్ని నెలల ముందే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో డిస్కషన్స్ జరగ్గా తాను ఆశించిన రేటు వాళ్లు చెప్పలేదని, వాళ్లు చెప్పిన నెంబర్ తనకు నచ్చలేదని విష్ణు చెప్పాడు. ఆ డిస్కషన్స్ లో భాగంగా ఒకవేళ సినిమా హిట్టైతే ఎంత ఇస్తారని అడిగితే వాళ్లు ఓ నెంబర్ చెప్పారని, ఆ నెంబర్ తనకు నచ్చి, సినిమా రిలీజై హిట్టయ్యాక వస్తా, డబ్బు రెడీ చేసుకోమని చెప్పి వచ్చానని విష్ణు తెలిపాడు. ఈ సినిమాకు తాను పెట్టిన బడ్జెట్ మొత్తం థియేటర్ల నుంచే వస్తాయని కూడా విష్ణు చాలా ధీమాగా ఉన్నాడు. మరి కన్నప్ప విష్ణుకు ఎలాంటి ఫలితాన్ని మిగులుస్తుందో చూడాలి.