‘నిశ్శబ్దం’ పై మౌనం పాటించండి చిత్ర నిర్మాతల విన్నపం
‘నిశ్శబ్దం’ సినిమా మొదలైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఈ సినిమాపై వస్తున్న పుకార్లు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఆ రూమర్లన్నీ అనుష్క చుట్టూనే కేంద్రీకృతమై నడుస్తున్నాయి. కోవిద్ 19 ఇంకా మన దేశానికి తాకకముందు అమెరికా షెడ్యూల్ కి వెళ్ళడానికి వీసా తిరస్కరించారని, చిత్ర యూనిట్ కి అనుష్కకీ పొసగడం లేదని, అనుష్క ఏమాత్రం సహకరించడం లేదని, ప్రమోషన్లకు రానని తెగేసి చెప్పేస్తోందని.. ఇలా రకరకాల వార్తలతో సినిమా విడుదల కూడా వాయిదాలూ వేయడం జరిగింది. అన్ని సౌవ్యంగా జరిగి ఏప్రిల్ 2 న సినిమా రిలీజ్ చేద్దామనుకున్న సమయం లో కరోనా ఎఫెక్ట్ వల్ల ‘నిశ్శబ్దం’ ఆ రిలీజ్ కాస్త ఆగిపోయింది.
ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి డవలప్మెంట్స్ లేవు. అయినా సరే.. ఇంకా రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతూనే వున్నాయి. దాంతో చిత్రబృందం ఈ విషయంపై స్పందించాల్సివచ్చింది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ నటీనటులు, సాంకేతిక నిపుణులు అందిస్తున్న సహకారం మర్చిపోలేదని, ముఖ్యంగా అనుష్క కష్టకాలంలో కూడా తమకు అండగా నిలిచిందని, ఈ సినిమాపై వస్తున్న ఎలాంటి రూమర్లనీ నమ్మొద్దని, త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఇస్తామని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇకనైనా ఈ పుకార్లు ఆగుతాయేమో లేదో చూడాలి మరి.













