సంజయ్ కోసం ‘కెజిఎప్ చాప్టర్ 2’ క్లైమాక్స్ వాయిదా వేస్తున్న డైరెక్టర్!
ఒకప్పుడు సౌత్‌లో కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నాలుగో స్థానంలో ఉండేది. తెలుగు, తమిళ్, మలయాళం తర్వాతే కన్నడ. తెలుగులో వచ్చిన సినిమాలకు 20 సంవత్సరాలు వెనకబడి ఉండేది సినీ పరిశ్రమ. దానికి తగ్గట్టుగానే సినిమాలు కూడా నిర్మించేవారు. ప్రేక్షకులు కూడా ఆ సినిమాలనే చూస్తూ ఎంజాయ్ చేసేవారు. కానీ, సీన్ ఇప్పుడలా లేదు. టాలీవుడ్‌కి పోటీగా కన్నడ సినీ పరిశ్రమ కూడా విస్తరిస్తోంది. దీనికి కారణం ఇటీవల కన్నడలో విడుదలై సూపర్‌హిట్ అయిన `కెజిఎఫ్` చిత్రం. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన కెజిఎఫ్ కన్నడ సినిమా స్టామినాను మరింత పెంచింది. ఇప్పడు ఆ సినిమాకి సీక్వెల్‌గా కెజిఎఫ్ చాప్టర్ 2 రూపొందుతున్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత పలు భాషల్లో విడుదల కానున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయింది. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. మళ్ళీ సజావుగా షూటింగులు ఎప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చో తెలీదు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎంతవరకు సహకరిస్తారో తెలీదు. ఈ కన్ఫ్యూజన్తోనే మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేసే ధైర్యం చేయలేదు చిత్ర యూనిట్. తాజాగా అందుతున్న సమాచారం మేరకు సెప్టెంబర్ మొదటివారంలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ చివరి షెడ్యూల్లోనే టోటల్‌గా షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే క్లైమాక్స్ మినగా మిగతా షూటింగ్ అంతా పూర్తి చేస్తారు. ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న సంజయ్‌దత్ ఆరోగ్యం బాగా లేని కారణంగా క్లైమాక్స్ షూటింగ్‌ను వాయిదా వేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కెజిఎఫ్ సూపర్‌హిట్ కావడంతో దాని సీక్వెల్ ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ సినిమాకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2021లో చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.













