నన్ను ఆపే దమ్ము ఎవరికైనా ఉందా?
మహిళల్లో ఫైర్ బ్రాండ్స్ కొంతమంది ఉంటారు. వారు రాజకీయాల్లో తమదైన శైలిలో చక్రం తిప్పుతుంటారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా అలాంటి ఫైర్ బ్రాండ్స్ ఉన్నారు. వివాదం ఏదైనా దానితో వార్తల్లోకి వచ్చి తనదైన శైలిలో ప్రత్యర్థులకు చెమటలు పట్టించగల సత్తా ఉన్న హీరోయిన్ కంగనా రనౌత్. మీటూ కావచ్చు, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వంటి ఘటన కావచ్చు. విషయం ఏదైనా తన మార్క్ ఎటాక్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది కంగనా. ఇటీవల టెర్రరిజంపై సంచలన వ్యాఖ్యలు చేసింది ముంబై మహానగరం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లా తయారైందంటూ కొత్త వివాదానికి తెరతీసింది. ఈమె చేసిన వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తే.. మరికొందరు మాత్రం అలాంటి కామెంట్స్ చేయడం సరికాదని విమర్శించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ముంబై పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆమె విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే కదా. దీంతో శివసేనకు చెందిన సంజయ్ రౌత్.. తమ అధికార పత్రిక సామ్నాలో విరుచుకుపడ్డారు.
ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే.. ముంబై మహానగరంలో అడుగుపెట్టొందంటూ అధికార పత్రిక సామ్నాలో రాసారు. ఆ మాటలతో కంగనాకు చిర్రెత్తుకొచ్చింది. నన్ను ముంబైలో అడుగు పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చారంటే ముంబై నగరం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తలపిస్తోందంటూ మరో బాణం విసిరారు. చనిపోక ముందు సుశాంత్ సింగ్ పోలీసులను అనేక మార్లు ఫిర్యాదు చేశాడని, ముంబై పోలీసులు వాటిని ఏమాత్రం పట్టించుకోలేదని, అందుకే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంది. అలాగే తనకు రక్షణ కల్పించే విషయంలో ముంబై పోలీసులపై తనకు నమ్మకం లేదు అన్నానంటే… అది ముంబైను, బాలీవుడ్‌ను ద్వేషించినట్టు ఎలా అవుతుందని ఆమె ప్రశ్నిస్తోంది. సంజయ్‌రౌత్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కంగనా మాట్లాడుతూ “నేను ఈ నెల 9న ముంబై వస్తున్నాను. ఎవరికైనా నన్ను ఆపే దమ్ము ఉంటే ఆపండి“ అంటూ సంజయ్ రౌత్‌కు, శివసేనకు సవాల్ విసిరింది. అధికార పార్టీపై కంగనా బహిరంగంగా సవాల్ విసరడం చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఆమె గట్స్‌ను అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. మరి 9న కంగనా ముంబై రాకతో అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.













