న్యూయార్క్ చలన చిత్రోత్సవంలో ఎంపికైన తొలి తెలుగు సినిమా
మీ మొదటి ప్రేమని గుర్తు చేసి గిలిగింతలు పెట్టేలా కంచరపాలెం ఉంటుంది అని యువ కథనాయకుడు రానా అన్నారు. ఆయన సురేశ్ బాబు ప్రొడక్షన్స్ పతాకంపై సమర్పిస్తున్న చిత్రమిది. వెంకటేశ్ మహా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విజయ్ ప్రవీణ పరుచూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్వీకర్ ఆగస్థి సంగీతం అందిస్తున్నారు. న్యూయార్క్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. కాగా, ఈ సినిమా ట్రైలర్ను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు రానా ప్రకటించారు. సెప్టెంబర్ 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని అన్నారు. ఇది ప్రతి ఒక్కరి తొలి ప్రేమను గుర్తు చేస్తుందని, ప్రేమ అవధులు లేనిది, అభిప్రాయాలకు అందనిదని అన్నారు. వైజాగ్ దగ్గరలో ఉన్న కంచెరపాలెం నేపథ్యంలో సాగే భిన్నమైన ప్రేమకథ ఇది. రానా ఈ చిత్రాన్ని చూసి, నచ్చి తానే విడుదల చేయడానికి ముందుకొచ్చారట. నూతన నటీనటులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.













