రామ్ చరణ్‌తో జాన్వీ.. బోనీ కపూర్ ఏమన్నాడంటే?
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా ఇది తెరకెక్కనుంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చేస్తున్న చరణ్, ఆ సినిమా పూర్తవగానే ఓ నెల రోజుల పాటూ మేకోవర్ కోసం గ్యాప్ తీసుకుని వెంటనే బుచ్చిబాబు సినిమా సెట్స్ లో జాయిన్ కానున్నాడు.
ఇప్పటికే RC16 బాగా లేటవడంతో చరణ్ వచ్చాక లేటవకూడదనే ఆలోచనతో అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. క్యాస్టింగ్ కు సంబంధించిన ఆడిషన్స్ కూడా ఈ నెలలోనే కొలిక్కి తీసుకురానున్నారు. సెలెక్ట్ చేసిన వారితో హైదరాబాద్‌లో వర్క్ షాప్ నిర్వహించి, సమ్మర్ నుంచి షూటింగ్ కు వెళ్లేలా బుచ్చిబాబు ప్లాన్ చేస్తున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేశారని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయంలో చిత్ర యూనిట్ మాత్రం స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో బోనీ కపూర్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. రామ్ చరణ్ తో తన కూతురు జాన్వీ కపూర్ నటించబోతుందని, ఇదంతా అమ్మవారి ఆశీర్వాదమేనని తెలిపాడు.
ఒకప్పుడు చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుని జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి ఇండస్ట్రీ హిట్స్ లో శ్రీదేవీ భాగం అయితే, ఇప్పుడు రామ్ చరణ్ తో జాన్వీ నటించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నాడు. కాబట్టి బుచ్చిబాబు- చరణ్ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తుందన్న వార్త అధికారికంగా కన్ఫర్మ్ అయినట్లే. ప్రస్తుతం దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్న జాన్వీ, వెంటనే రామ్ చరణ్ పక్కన ఛాన్స్ కొట్టేయడమంటే మామూలు విషయం కాదు. ఈ రెండు సినిమాలూ హిట్ అయితే జాన్వీ టాలీవుడ్ లో ఎంచక్కా సెటిలైపోవచ్చు.













