టాలీవుడ్ లోకి జాహ్నవీ కపూర్ ఎంట్రీ ఎప్పుడంటే….
జాహ్నవీ కపూర్ శ్రీదేవి బోనీ కపూర్ల గారాల పట్టి సినిమా నేపథ్యానికి కారణభూతురాలైన శ్రీదేవి రూపాన్ని ఆరాధ్యదేవతగా దాదాపు మూడు దశాబ్దాలు తెలుగుప్రేక్షకులు వయోభేదం లేకుండా ఆరాధించారు. మాస్ ప్రేక్షకులు గుండెల్లో గుడి కట్టుకున్నారు. ఆ నేపధ్యం పేరే శ్రీదేవి. ఈ మూడు అక్షరాలు కాశ్మీర్ టు కన్యాకుమారి…ధియేటర్స్‌కు విరామం అన్నది లేకుండా నిద్రపోనివ్వలేదు. ఆ శ్రీదేవి ముద్దులు కూతురు జాహ్నవీ కపూర్ తెలుగులో ఓ ప్రముఖ దర్శకుడు చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నట్టుగా అధికారిక సమాచారం.ఆ దర్శకుడు కూడా విభిన్నచిత్రాలకు పేరుపడి క్రియేటివ్ జీనియస్ గా ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. తన కథే అయినా సరే అంత ఈజీగా ఒప్పుకోలేడు. తనకి ట్రేడ్‌లో, పరిశ్రమలో ఎంత ఫాలోయింగ్ ఉన్నప్పటికీ డబ్బు మీద వ్యామోహంతో సినిమా మీద సినిమా చేయడానికి సిద్ధపడని దర్శకుడిగా కొనసాగుతూ వస్తున్న ఆ జీనియస్ చెప్పిన కథను విని బోనీకపూర్ కూడా తెలుగులో తన కూతురు అరంగేట్రంకి ఇదే కరెక్టు అవకాశమని భావించాడని, అయితే ఆ సినిమా ఎప్పడు ఎలా అన్న విషయాలు త్వరలోనే బైటకొస్తాయని తెలుస్తోంది.
శ్రీదేవిలో కళ్ళల్లో ఉన్న వెలుగు, ముఖంలో ఉన్న లైట్ జాహ్నవీ కపూర్‌లో ఉన్నాయని, తన పాత్రకి జాహ్నవీ అయితేనే న్యాయం జరుగుతుందని సదరు దర్శకుడు సైతం వ్యక్తం చేస్తున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. అయితే గతంలో కూడా జాహ్నవీ కపూర్‌ను తెలుగులోకి తీసుకురావాలని శ్రీదేవి బ్రతికున్నప్పుడే కొన్ని ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయి. శ్రీదేవి మరెందుకో అంతగా ఆనాడు తెలుగులో కూతురు అరంగేట్రంకి మొగ్గు చూపలేదు.తెలుగు సినిమాల మార్కెట్ బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ స్థాయిని అధిగమించిన తర్వాత తెలుగు సినిమాలకే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ డబుల్, త్రిబుల్ అవడంతో తెలుగు సినిమాలను బాలీవుడ్ వాళ్లు సైతం చిన్నచూపు చూడలేకపోతున్నారు. నిజానికి తెలుగు సినిమాలంటే భయపడుతున్నారు. పాన్ ఇండియా స్టేటస్‌ని తెలుగు సినిమాలు ఊహించని రీతిలో కొల్లగొట్టాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కన్నా టాలీవుడ్ ద్వారానే జాహ్నవి కపూర్‌కి ఎక్కువ క్రేజ్ వస్తుందని బోనీకపూర్ ఆంచనా వేస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఆ అరంగేట్రం ఎప్పడో, ఎలాగో అన్నీ త్వరలోనే తెలుస్తాయి.













