నిర్మాత నష్టపోకుండా షూటింగ్ చెయ్యాలంటే అదొక్కటే మార్గమా?
లాక్డౌన్ నిబంధనల వల్ల నష్టపోయిన పరిశ్రమల్లో చిత్ర పరిశ్రమ ఒకటి. గత మూడు నెలలుగా సినిమా షూటింగులు లేకపోవడం, థియేటర్స్ మూతపడడం వంటి కారణాలతో చిత్ర పరిశ్రమ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. సినిమాలు మొదలుపెట్టి షూటింగులు మధ్యలోనే ఆపేసిన నిర్మాతలు నానా అవస్థలు పడుతున్నారు. షూటింగులు ప్రారంభించుకోవడానికి అనుమతులు ఇవ్వాలని ఇటీవల సినీ పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ను కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం కొన్ని షరతులతో కూడిన అనుమతిని ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే ఎప్పటి నుంచి షూటింగులు ప్రారంభించుకోవచ్చు అనేది త్వరలోనే తెలియజేస్తారట. ప్రభుత్వం విధించిన షరతులతో షూటింగ్ చెయ్యాలంటే పెద్ద నిర్మాతలకు సైతం కష్టంతో కూడుకున్న పనే. వీలైనంత తక్కువ మెంబర్స్‌తో షూటింగ్ చెయ్యాలన్నది దర్శకనిర్మాతల ఆలోచన. అయితే అది ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది పెద్ద ప్రశ్న.
లాక్డౌన్ కారణంగా నష్టపోయిన దాన్ని రికవర్ చేసుకోవడానికి కాస్ట్ కటింగ్ ఒక్కటే మార్గమని కొంతమంది నిర్మాతల అభిప్రాయం. ప్రస్తుతం `ఆర్ ఆర్ ఆర్` చిత్రాన్ని రూపొందిస్తున్న రాజమౌళి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రొడక్షన్‌కి సంబంధించిన ఖర్చులు తగ్గిస్తే సినిమా క్వాలిటీ దెబ్బతింటుంది. అందుకే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ రెమ్యునరేషన్లలోనే కొంత కోత పెడితే నిర్మాతకు ఎంతో కొంత లాభం చేకూరుతుందని రాజమౌళి భావిస్తున్నాడట. మరి దీనికి ఎంతమంది ఒప్పుకుంటారు అనేది మరో సమస్య. దీనిపై రాజమౌళి కసరత్తు చేస్తున్నాడట.
పెద్ద సినిమాల విషయంలోనే ఈ విధంగా ఆలోచిస్తే చిన్న నిర్మాతల పరిస్థితి ఏమిటి? మధ్యలోనే ఆగిపోయిన సినిమాలను ఎప్పటికైనా పూర్తి చేసే అవకాశం ఉందా? ఏ విధంగా చూసినా ప్రభుత్వం విధించిన షరతులతో షూటింగ్ పూర్తి చేసి నిర్మాత క్షేమంగా బయట పడే అవకాశాలు చాలా తక్కువ. అన్ని సమస్యలు తీరి దేశం మునుపటి పరిస్థితికి రావడానికి చాలా కాలం పడుతుంది. ప్రస్తుతం షూటింగులు ప్రారంభించి, థియేటర్స్ ఓపెన్ చేసినా సినిమాలు చూడడానికి జనం ఇంతకుముందులా ఇంట్రెస్ట్ చూపిస్తారన్న నమ్మకం లేదు. మరి ఈ సమస్యలన్నింటినీ అధిగమించి చిత్ర పరిశ్రమ లాభాల బాటలోకి ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













