లోకేష్ కనగరాజ్ రూట్ లో వెళ్తున్న శంకర్
ఏ స్టార్ నుంచైనా సినిమా వస్తుందంటే ఆ హీరో ఎక్కువ సేపు కనిపించాలని సదరు హీరో ఫ్యాన్స్ కోరుకోవడం కామన్. డైరెక్టర్లు కూడా ఆ యాంగిల్ లోనే ఆలోచించి కథలు రాసుకుంటారు. కానీ లోకేష్ కనగరాజ్ మాత్రం దీన్ని పూర్తిగా మార్చేశాడు. అతని దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమాలో హీరో అయిన కమల్ హాసన్ సినిమా మొత్తం మీద కనిపించేది 47 నిమిషాలే అని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పేవరకు ఎవరూ గుర్తు పట్టలేకపోయారు.
విక్రమ్ సినిమాలో స్క్రీన్ ప్లే ఆ రేంజ్ లో మ్యాజిక్ చేసింది. ఆ సినిమాలో అందరి కంటే ఎక్కువ స్క్రీన్ టైమ్ సపోర్టింగ్ రోల్ చేసిన ఫహద్ ఫాసిల్ దక్కించుకోవడం విశేషం. ఇప్పుడు కమల్ నటిస్తున్న ఇండియన్2 సినిమా విషయంలో కూడా అదే రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమాలో కీలక పాత్రలో నటించిన సిద్ధార్థ్ చెప్తున్నాడు.
సేనాపతి ఇండియాకు వచ్చే క్రమంలో కమల్ ను కాపాడే కీలకమైన ట్విస్ట్ తన పాత్ర మీదే జరుగుతుందని, ఇంకా చెప్పాలంటే కమల్ కంటే తనే తెరపై ఎక్కువ కనిపిస్తానని రీసెంట్ గా ఓ తమిళ ఇంటర్వ్యూలో చెప్పాడు సిద్ధార్థ్. రన్ టైమ్ ఎంతన్నది చెప్పలేదు కానీ విక్రమ్ లో లాగానే ఈ సినిమాలో కూడా కమల్ స్క్రీన్ టైమ్ తక్కువ ఉంటుందని తెలుస్తోంది. జులై లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా 1996లో రిలీజైన ఇండియన్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.













