రవితేజతో నా కాంబినేషన్ డెఫినెట్ గా మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది – ఇలియానా
మాస్ మహారాజా రవితేజ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోని’. దాదాపు ఆరేళ్ళ గ్యాప్ తర్వాత హీరోయిన్ ఇలియానా ఈ సినిమాలో నటించింది. ఈ చిత్రం నవంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ ఇలియానాతో జరిపిన ఇంటర్వ్యూ.
చాలా గ్యాప్ తర్వాత తెలుగులో సినిమా చేయడం ఎలా అనిపించింది?
– ఆరేళ్ల తర్వాత తెలుగులో ఈ సినిమా చేశాను. చాలా సంతోషంగా ఉంది.
తివిక్రమ్‌గారి ‘జులాయి’ సినిమా చేస్తున్నప్పుడు బాలీవుడ్‌లో ‘బర్ఫీ’ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా స్టోరీ గురించి త్రివిక్రమ్‌గారికి చెప్పాను. ‘చాలా గొప్పగా ఉంది. తప్పకుండా చెయ్’ అని అన్నారు. ఓ మంచి సినిమాలో భాగం కావాలని ఎవరైనా కోరుకుంటారు. కాబట్టి నేను కూడా ఆ సినిమా చేయడానికి సరేనన్నాను. ఆ సినిమా సక్సెస్ తర్వాత అక్కడ వరుస అవకాశాలు వచ్చాయి. ఇక్కడ సినిమా చేయడానికి వీలు కాలేదు. అదే సమయంలో నేను తెలుగులో సినిమా చేయడానికి ఇష్టపడటం లేదంటూ ఇక్కడ వార్తలు వచ్చాయి. ఇక్కడ ఆరేళ్ల పాటు సినిమా చేసిన నేను ఎందుకు సినిమాలు చేయను అని ఎవరూ ఆలోచించలేదు. అలాగే తెలుగులో మంచి కథలు కూడా రాలేదు. కెరీర్ ప్రారంభంలో మంచి కథ అనిపిస్తే ఎక్కువగా ఆలోచించకుండా చేసేదాన్ని. ‘పోకిరి’ చేసేటప్పుడు అది అంత పెద్ద హిట్ అవుతుందని నేను ఊహించలేదు. నేను ఆ సినిమా చేయకూడదని అనుకుంటున్న సమయంలో మహేష్‌గారి సోదరి మంజులగారు నాతో మాట్లాడి ఒప్పించారు. ‘పోకిరి’ నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఎలా స్ఠార్ట్ అయ్యింది?
– ఈ సినిమా ఒప్పుకోవడానికి మొదటి కారణం కథ. నేరేషన్ టైమ్‌లోనే చాలా ఎక్సయిట్ అయ్యాను. గ్లామర్‌గా కనిపిస్తూ… నటనకు ఆస్కారమున్న పాత్ర! వీటికి తోడు రవితేజ నా ఫేవరేట్ హీరో. దాంతో వెంటనే ఒప్పేసుకున్నా! అలాగే రవితేజ వంటి హీరోతో నటించడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. ఆయనతో ఇది నా నాలుగో సినిమా. సినిమాలో నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. నా పాత్ర గురించి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అయితే చాలా లేయర్స్‌తో కూడుకున్న కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అని మాత్రం చెప్పగలను. పెర్‌ఫార్మెన్స్‌కి మంచి స్కోప్ ఉన్న చిత్రమే కాదు.. కమర్షియల్ విలువలున్న చిత్రం కూడా. అందుకే అసలు అమర్, అక్బర్, ఆంటోని ఎవరనే ఆసక్తిని అందరిలో పెంపొందించింది. మరి ముగ్గురు ఒకరేనా? వేర్వేరు వ్యక్తులా అని తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
ఇకపై తెలుగులో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?
– ఒక మనిషి ఆలోచనలే అతని ప్రవర్తనకు అద్దం పడతాయి అని నేను నమ్ముతాను. గ్లామర్‌గా ఉండే రోల్స్ చేయను… కేవలం పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న రోల్స్ మాత్రమే చేయాలని అనుకోవడం లేదు. గ్లామరస్ రోల్స్‌లో కూడా పెర్ఫామన్స్‌కు చాలా మంచి స్కోప్ ఉంటుంది. అలాంటి పాత్రనే అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో చేశాను. ఒకప్పుడు మగధీరలో రాజకుమారిలాంటి పాత్రలను చేయాలని కోరిక ఉండేది. కానీ ఇప్పుడు నాకు పర్టిక్యులర్‌గా అలాంటి డీమ్ రోల్స్ చేయాలనే ఆలోచనలైతే లేవు.
తొలిసారి తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఎలా అనిపించింది?
– ఈ సినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. తెలుగులో డబ్బింగ్ చెబుతానని ఎప్పుడూ అనుకోలేదు. శ్రీనుగారు నా వాయిస్ బావుంటుందని చెప్పించారు. డబ్బింగ్ స్టూడియోకి వెళ్లి చెప్పేవరకూ నమ్మకం కుదర్లేదు. డబ్బింగ్ థియేటర్‌లో అడుగుపెట్టగానే… చమటలు పట్టేశాయి. ఎందుకంటే తెలుగు పదాలు స్పష్టంగా పలక్కపోతే దాని అర్ధం మారి పోతుంది. కానీ డైరెక్టర్‌గారి సహకారంతో చాలా కష్టపడి మూడు రోజుల్లో డబ్బింగ్ పూర్తి చేశాను. నా వాయిస్ నాకు నచ్చలేదు. కానీ, ప్రేక్షకులకు నచ్చుతుంది అనుకుంటున్నాను.
ఈమధ్య కాలంలో డిప్రెషన్‌లోకి వెళ్లారని వార్తలు వస్తున్నాయి?
– నేను నటిని. సెట్లో నటిస్తాను. అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే అందరిలాగానే నార్మల్‌గా ఉంటా. వండుకోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం అన్నీ నేనే చేసుకుంటాను. కానీ, పర్సనల్ లైఫ్ పర్సనల్‌గా ఉంటేనే బావుంటుందని అనుకుంటున్నాను. అది కూడా నా వ్యక్తిగత విషయాలు చెప్పాలనుకుంటే చెబుతాను.. అలాగని మొత్తం చెప్పను. ప్రస్తుతం మానసిక ఆరోగ్యం గురించి మనందరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని అర్థం చేసుకోగలగాలి. నేనే అర్థం చేసుకోలేకపోయాను. కానీ, కొన్ని రోజులు మానసికంగా ఇబ్బంది పడ్డాను. యాంగ్జయిటీ, డిప్రెషన్‌లోకి వెళ్లడం ఇవన్నీ నార్మల్ బిహేవియర్ కాదు. సో.. అందరూ ఈ మానసిక ఆరోగ్యం మీద అవగాహన పెంచుకోవాలి.
ఈ గ్యాప్‌లో తెలుగు సినిమాలలో ఆఫర్స్ వచ్చాయా?
– ఈ మధ్యలో కూడా కొన్ని సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేయమని ఆఫర్స్ వచ్చాయి. స్క్రిప్ట్స్ కుదరక మిస్ అయ్యాయి. సాంగ్స్ చేయాలంటే అది ఆ సినిమాకు ఉపయోగపడుతుందా? లేదా? అని ఆలోచించాను. అంత స్పెషల్‌గా ఉండదనిపించి వదిలేశాను. ఇటీవల ఓ పెద్ద సినిమా కూడా వదిలేశా. మంచి స్క్రిప్ట్, మంచి టీమ్ ఉన్నా నా పాత్ర చాలా చిన్నదిగా ఉండడంతో చేయలేదు.
‘మీటూ’ పై మీ స్పందన?
– అది స్త్రీ కావచ్చు.. పురుషుడైనా కావచ్చు. లైంగిక వేధింపులను భరించిన వ్యక్తి ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పడం చాలా మంచి విషయం. ఎవరో ఒకరు ముందుకు వస్తేనే ఇలాంటి సమస్యలు తీరుతాయి. ఇలాంటి సమస్యపై నేను స్పందించాల్సిన సమయంలో కచ్చితంగా స్పందిస్తాను.
మీ నెక్స్‌ట్ పాజెక్ట్స్?
– తెలుగులో కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. వాటి వివరాలను తొందరలోనే తెలియజేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు ఇలియానా.