అన్నయ్యే ఆది గురువు: పవన్ కల్యాణ్
మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆయన తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నయ్యకు ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ప్రత్యేక ప్రకటన విడుదల చేసిన పవన్… తనకు అన్నయ్యే తొలి గురువని, జన్మనిచ్చిన తల్లిదండ్రులపై ఉన్నంత ఆరాధనాభావం అన్నయ్య చిరంజీవి పట్ల కూడా ఉందన్నారు. కొందరు ఆయనలా అభినయం ప్రదర్శించాలని స్ఫూర్తి పొందితే, మరికొందరు ఆయనలోని సేవా భావాన్ని చూసి స్ఫూర్తి పొందారని తనకూ ఆయనే స్ఫూర్తి ప్రదాత అని వెల్లడించారు ఉందన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం చిరంజీవిలోని గొప్పదనం అని, అంచెలంచెలుగా ఎదిగిన చిరంజీవి… తెలుగువారు సగర్వంగా చిరంజీవి మావాడే అని చెప్పుకునేలా తనను తాను మలచుకున్నారన్నారు. శ్రమైక జీవనమే చిరంజీవి విజయానికి సోపానమైందన్నారు. అటువంటి కృషీవలుడికి తమ్ముడిగా పుట్టడం తన అదృష్టం అని పవన్ వ్యాఖ్యానించారు. తన అన్నయ్యకు సుఖశాంతులతో కూడిన పూర్ణాయుష్షు ఇవ్వాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. తన సోదరుడి పుట్టినరోజు సందర్భంగా తెలుగువారందరూ ఆయన్ను ఆశీర్వదించాలని ఆయన కోరారు.













