వివాదంపై రాజ్ తరుణ్ ఏమన్నాడంటే
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన లావణ్య అనే అమ్మాయి పెట్టిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆ కేసు ఫైల్ అయిన దగ్గర నుంచి రాజ్ తరుణ్ మీడియా ముందుకు రాలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పురుషోత్తముడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా రాజ్ తరుణ్ రాలేదు.
ఇదిలా ఉంటే ఇప్పుడు తిరగబడరా సామీ ప్రమోషన్స్ కోసం రాజ్ తరుణ్ మీడియా ముందుకొచ్చాడు. ఊహించినట్లే రాజ్ తరుణ్ ను మీడియా ఫోకస్ చేసి ఆ కేసుకు సంబంధించిన ప్రశ్నలే ఎక్కువ అడిగింది. దీంతో ఉక్కిరిబిక్కిరైన రాజ్ తరుణ్ కేవలం సినిమా గురించి మాత్రమే మాట్లాడదామని చెప్పినా సరే జర్నలిస్టులు వినకపోవడంతో ఫైనల్ గా ఆ వివాదం పై రాజ్ తరుణ్ స్పందించాడు.
లావణ్య చేసిన అలిగేషన్లు తప్పని ప్రూవ్ చేయడానికి తన దగ్గర పూర్తి ఆధారాలున్నాయని, వేరే పేర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవడం వల్ల అన్నీ బయటపెట్టలేకపోతున్నట్లు చెప్పాడు. పురుషోత్తముడు ఈవెంట్ కు రాకపోవడానికి కారణం తను తీవ్ర మనస్థాపానికి గురవడమేనన, అందుకే బయటకు రాలేదని తెలిపాడు. పదే పదే అవే ప్రశ్నలు రిపీట్ అవడంతో రాజ్ తరుణ్ అసహనానికి గురయ్యాడు. ఎన్నడూ లేనివిధంగా రాజ్ తరుణ్ ప్రెస్ మీట్ కు భారీ సంఖ్యలో మీడియా ప్రతినిధులు హాజరవడం ఇదే మొదటిసారి.













