నితిన్ ఎందుకీ మౌనం?
మాచర్ల నియోజకవర్గం సినిమాతో డిజాస్టర్ అందుకున్న నితిన్, ఆ తర్వాత రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య మారేడుమిల్లి ఫారెస్ట్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుని, ఆ షూటింగ్లో తెరకెక్కించిన సన్నివేశాల్లోని ఓ లుక్‌ని రిలీజ్ చేసి ప్రీ లుక్ స్టిల్‌తో సినిమాపై ఆ టైమ్‌లో ఫుల్ అటెన్షన్ తీసుకొచ్చారు.
కానీ ఇప్పుడు మాత్రం ఉన్నపళంగా సినిమా యూనిట్, నితిన్ సైలెంట్ అయిపోయారు. నితిన్ ఈ సినిమా షూటింగ్ గురించి ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటున్నాడు. నితిన్ మొన్నీ మధ్య ధరించిన హనుమాన్ మాల వల్లే ఈ బ్రేక్ తీసుకున్నాడా లేక షూట్ చేసిన రషెస్ చూసి, గ్యాప్ తీసుకుని మళ్లీ రీషూట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది.
రైటర్‌గా మంచి పేరున్న వక్కంతం వంశీ, బన్నీతో చేసిన నా పేరు సూర్య సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో వంశీ రెండో సినిమా సెట్ చేసుకోవడానికి అనుకున్న దానికంటే చాలా ఎక్కువ టైమే పట్టింది. ఫైనల్‌గా ఎర్ర చందనం కాన్సెప్ట్‌లో నితిన్‌కు ఓ కథ చెప్పి, సినిమాను ఓకే చేసుకున్నాడు. ఈ సినిమాలో నితిన్ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు.
భీష్మ తర్వాత నితిన్‌కు ఇంకో హిట్ లేదు. దీంతో నితిన్‌కు కూడా వక్కంతం ఎలాగైనా హిట్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. దర్శకుడిగా తను ప్రూవ్ చేసుకోవడంతో పాటు, నితిన్ కు హిట్ ఇచ్చే బాధ్యత వక్కంతం మీద ఉన్నాయి. మరి ఈ సినిమాతో అయినా నితిన్ హిట్ అందుకుంటాడా లేదా చూడాలి.













