పవన్‌కల్యాణ్ సినిమాకి ఇంకా టైమ్ ఉంది.. ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ ఏం చేయబోతున్నాడు?
డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా పవన్‌కల్యాణ్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రారంభం కావడానికి ఇంకా చాలా టైమ్ పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం పవన్‌కల్యాణ్ చేస్తున్న వకీల్‌సాబ్ షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు షూటింగ్స్‌కి అనుమతి ఇచ్చినప్పటికీ కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో షూటింగ్ ప్రారంభించే అవకాశాలు తక్కువ. ఈ సినిమా పూర్తయిన తర్వాత క్రిష్ డైరెక్షన్లో సినిమా చెయ్యాల్సి ఉంది. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. ఇక హరీష్ శంకర్ సినిమా ఇప్పట్లో ఉండే అవకాశం లేదు. దీంతో హరీష్‌కి చాలా టైమ్ చిక్కింది. ఈ గ్యాప్‌లో హరీష్ శంకర్ నిర్మాతగా మారబోతున్నాడు. నిర్మాత బన్నివాస్‌తో కలిసి ఓ మీడియం బడ్జెట్ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. సింగిల్ షెడ్యూల్లో ఫాస్ట్‌గా సినిమాని కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా ద్వారా దీపక్ అనే కొత్త దర్శకుడ్ని పరిచయం చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
మరో పక్క పవన్‌కల్యాణ్‌తో చేయబోయే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌కి మెరుగులు దిద్దుతున్నాడు హరీష్. గబ్బర్ సింగ్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా అంటే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు చాలా భారీగా ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే విధంగా స్క్రిప్ట్‌ని పక్కాగా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చేసుకునే అవకాశం వచ్చింది. గబ్బర్‌సింగ్ చిత్రాన్ని పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దిన హరీష్ ఎనిమిదేళ్ళ తర్వాత మళ్లీ తన అభిమాన హీరోతో సినిమా చేసే అవకాశం రావడంతో అన్ని విషయాల్లో ఎంతో కేర్ తీసుకుంటున్నాడు. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో మరో బ్లాక్‌బస్టర్ వస్తుందని అభిమానులు ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.













