మోక్షజ్ఞతో గోపీచంద్ సంభాషణ
టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల వారసులున్నప్పటికీ చాలా మంది ఎదురుచూస్తున్నది మాత్రం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించే. ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం ఉంటుందా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. బాలయ్య కూడా మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయడానికి మంచి సమయం కోసం ఎదురుచూస్తున్నాడు.
మంచి కథ, డైరెక్టర్ దొరికితే మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయాలని చూస్తున్న బాలయ్య చివరకు తానే మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తానని, తన దర్శకత్వంలోనే ఆ సినిమా ఉంటుందని కూడా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. మళ్లీ ఆ తర్వాత పలువురు డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, శ్రీకాంత్ ఓదెల లాంటి డైరెక్టర్ల పేరు ఈ లిస్ట్ లో ఉన్నాయి.
బాలయ్యతో వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన గోపీచంద్ మలినేని పేరు ఇప్పుడు ఈ లిస్ట్ లోకి చేరింది. తాజాగా గోపీచంద్, మోక్షజ్ఞ మధ్య ఓ ఇంట్రెస్టింగ్ కాన్వో జరగ్గా, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారనేది మాత్రం తెలియదు కానీ ఓ డీల్ గురించి వారు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనా వారిద్దరూ మాట్లాడుకుంది సినిమా గురించా లేక వేరే ఏమైనా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. బాలయ్య విషయానికొస్తే ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి చేస్తున్న ఆయన, ఈ దసరాకు ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. భగవంత్ కేసరి అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.













