పవన్‌కు తల్లిగా ఒకప్పటి హీరోయిన్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా సినిమా ఉస్తాద్ భగత్‌సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పవన్, హరీష్ శంకర్ కాంబోలో సినిమా వస్తుందనగానే ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. హరీష్ శంకర్ పవన్ కు అభిమాని కావడంతో ఫ్యాన్స్ ఆయన్నెలా చూడాలనుకుంటారో ఆయనకు బాగా తెలుసు.
దానికి తోడు వీరి కాంబోలో ఇప్పటికే వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా మంచి హిట్ అవడంతో ఈ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ కూడా సంతృప్తికరంగా ఉందని టాక్. తమిళ సినిమా తేరి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ కూడా అందరి అంచనాలను అందుకుంది.
గబ్బర్‌సింగ్ లానే ఈ సినిమా కూడా రికార్డులను సృష్టించడం ఖాయమని పవన్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలో ఒకప్పటి హీరోయిన్ గౌతమి నటిస్తుందని సమాచారం. గౌతమి ఈ సినిమాలో పవన్ కు తల్లి పాత్రలో కనిపించనుందని టాక్. ఈ మధ్యే గౌతమికి మళ్లీ వరుస అవకాశాలొస్తున్నాయి. రీసెంట్ గా అన్నీ మంచి శకునములే, శాకుంతలం సినిమాల్లో నటించినప్పటికీ అవేమీ ఆమె కెరీర్‌కు ఉపయోగపడలేదు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్‌తో అయినా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ పుంజుకుంటుందేమో చూడాలి. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్ ను వచ్చే వేసవిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.













