Game Changer: రివ్యూ : ముందుగా ఊహించిన డేంజర్ ‘గేమ్ ఛేంజర్’

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్
నటీనటులు: రాంచరణ్, అంజలి, కియారా అద్వానీ, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్ తదితరులు
సంగీతం: ఎస్ ఎస్ తమన్, సినిమాటోగ్రఫీ: ఎస్ తిరుణ్ణావుక్కరసు
మాటలు : సాయి మాధవ్ బుర్రా, కథ: కార్తీక్ సుబ్బరాజ్
రచనా సహకారం: ఎస్‌యు వెంకటేశన్, వివేక్
లైన్ ప్రొడ్యూసర్స్: నరసింహా రావు ఎన్, ఎస్ కే జబీర్ లైన్
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్ల, కొరియోగ్రాఫర్స్: అన్బరివు
కొరియోగ్రాఫర్స్: ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కో మార్టిస్, జానీ, శాండీ
సాహిత్యం: రామ్ జోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్
సహ నిర్మాత: హర్షిత్, సమర్పణ: శ్రీమతి అనిత
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
దర్శకత్వం: ఎస్ శంకర్
విడుదల తేది : 10.01.2025
నిడివి : 2 ఘంటల 45 నిముషాలు
ఒకప్పుడు తెలుగు దర్శకులకు చాలామందికి టార్చ్ బేరర్ అయ్యారు దర్శకుడు శంకర్(Shankar). జెంటిల్ మాన్, ఒకే ఒక్కడు, ప్రేమికుడు, భారతీయుడు, అపరిచితుడు ఇలా ఒక్కో చిత్రం ఒక్కో వజ్రమే. తీస్తే శంకర్‌లా సినిమా తీయాలి. అన్నట్టు టాలీవుడ్ అనుకుండేది.అంతర్జాతీయ స్తాయిలో భారీ సినిమా, భారీ బడ్జెట్, భారీ హంగులద్ది సాంకేతికంగా అడ్వాన్సుగా వుండే దర్శకుడు శంకర్. సౌత్ ఇండియాలోని స్టార్ హీరోలంతా శంకర్‌తో ఒక్క సినిమా అయినా తీయాలని క్యూలు కట్టిన సందర్భాలు కూడా వున్నాయి. ప్రతి నటుడికి శంకర్ దర్శకత్వంలో పనిచేయాలనేది కల. అలాంటి మేటి దర్శకుడి దర్శకత్వంలో సినిమా వస్తుందంటే….పెదవి విరిచే స్తాయికి ఈ నేటి ప్రేక్షకుడు ట్రోలింగ్ చేస్తున్నాడు. కారణం హిట్ చిత్రాల దర్శకుడిగా ఓ వెలుగు వెలిగిన శంకర్‌కి ఈ మధ్య కాలంలో హిట్టు లేకుడా పోవడం. ఇలాంటి తరుణంలో దిల్ రాజు తొలి సారిగా రూ.500 కోట్ల బడ్జెట్‌తో రామ్ చరణ్ హీరోగా ‘గేమ్ ఛేంజర్’ నిర్మించాడు. తొలుత నుండి దిల్ రాజు రిస్క్ చేసాడు బయట పడతాడో లేదో అన్న మీమాంస లో వున్న ప్రేక్షకులు, ఇండస్ట్రీ ప్రముఖులకు ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ఎలాంటి సమాధానం చెప్పిందో సమీక్షలో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే.. గత ఐదేళ్ల క్రితం నుంచి ఆంధ్ర ప్రదేశ్ జరిగిన అస్తవ్యస్త పాలన టార్గెట్‌గా చేసుకొని దర్శకుడు శంకర్ సంధించిన పొలిటికల్ సెటైర్ ఈ సినిమా. ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్‌కి అవినీతి పరుడైన మంత్రికి మధ్య జరిగే పోరే ‘గేమ్ ఛేంజర్’. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్)తో గేమ్ ఛేంజర్ కథ మొదలౌతుంది. అడ్డదారిలో సీఎం అయ్యి.. అవినీతికి అడ్రస్‌గా మారిన సత్యమూర్తిలో పశ్చాత్తాపం కలుగుతుంది. తన పదవీకాలం చివరి ఏడాదిలో రాష్ట్రంలో ఎలాంటి అవినీతి ఉండకూడదని నిశ్చియించుకుంటాడు. అయితే అతని మంత్రివర్గంలో ఉన్న కొడుకులు మోపిదేవి (ఎస్.జే సూర్య), రామచంద్ర రెడ్డి (జయరాం)లు విభేదిస్తారు. చివరికి తండ్రినే చంపేసి.. సీఎం కావాలని అనుకుంటాడు మోపిదేవి. ఆ తరుణంలోనే సొంత ఊరు వైజాగ్‌కి కలెక్టర్‌గా అడుగుపెడతాడు రామ్ నందన్ (రామ్ చరణ్). వచ్చీ రావడంతోనే అవినీతి ప్రభుత్వంపై ఉక్కుపాదం మోపి.. మోపిదేవి ఆట కట్టిస్తాడు. అనూహ్య పరిస్థితుల్లో సత్యమూర్తి.. రామ్ నందన్‌ని రాష్ట్ర సీఎంగా ప్రకటిస్తాడు. సీఎం సత్యమూర్తికి కుమారుల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? రామ్ నందన్‌ను సత్యమూర్తి సీఎంగా ఎందుకు ప్రకటించాడు? సీఎం పదవిని రామ్ నందన్ ఎందుకు నిరాకరించాడు? ముఖ్యమంత్రి పదవిని మోపిదేవీకి అప్పగించి అతడికి రామ్ నందన్ ఎలాంటి షాక్ ఇచ్చాడు? దీపిక (కియారా అద్వానీ)తో ప్రేమాయణానికి ఎందుకు బ్రేక్ పడింది? రామ్ నందన్ తన తల్లిదండ్రులు అప్పన్న (రాంచరణ్), పార్వతి (అంజలి)కి ఎందుకు దూరమయ్యాడు? అప్పన్నకు సీఎం సత్యమూర్తికి ఉన్న విభేదాలు ఏంటి? చివరకు మోపిదేవీ సీఎం పదవిపై ఆశలకు రామ్ నందన్ ఎలా చెక్ పెట్టి.. ఏపీని రాక్షస పాలన నుంచి ఎలా కాపాడాడు? అనే ప్రశ్నలకు సమాధానమే గేమ్ ఛేంజర్ సినిమా కథ.
నటీనటుల హావభావాలు :
నటీనటులు పోటీ పడి పెర్ఫార్మెన్స్‌ను ఇచ్చారు. రామ్ నందన్‌గా, అప్పన్నగా రాంచరణ్(Ram Charan) తన నటనా విశ్వరూపాన్ని చూపించాడు. కలెక్టర్‌గా, ప్రజా నాయకుడిగా రెండు పాత్రల్లో అద్బుతమైన వైవిధ్యాన్ని చూపించాడు. అప్పన్న పాత్రగా పండించిన ఎమోషన్స్ కీలకం. స్టైలీష్‌గా డిఫరెంట్ లుక్స్‌లో రామ్ చరణ్ ఆకట్టుకుంటాడు. మళ్లీ తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్‌తో రామ్ చరణ్ అందరినీ మెప్పించాడు. ఇక మోపిదేవీగా ఎస్‌జే సూర్య పవర్ ప్యాక్ట్ క్యారెక్టర్‌తో అల్లాడించాడు. రామ్ చరణ్‌తో నువ్వా నేనా అనే విధంగా నటించాడు. గుండు లుక్‌లో విలనిజం పండించారు.ఇక పార్వతి పాత్రలో అంజలి ఉత్తమ నటనను, సినిమాకు కావాల్సిన బోలెడంత ఎమోషన్‌ను అందించింది. కొన్ని సీన్లలో కంటతడి పెట్టించే భావోద్వేగాన్ని పండించింది. శ్రీకాంత్, జయరామ్, సముద్రఖని తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. సునీల్, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల పర్వాలేదనిపించారు.సైడ్ సత్యంగా సునీల్ నవ్వించే ప్రయత్నం చేశారు కానీ పెద్దగా ఆకట్టుకోలేదు.
సాంకేతికవర్గం పనితీరు :
శంకర్ సినిమాలు అంటేనే టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో వుంటాయన్న విషయం తెలిసిందే! గ్రాఫిక్ వర్క్ బాగుంది, సెట్ వర్క్, వీఎఫ్ఎక్స్ ఇలా అన్నీ అద్భుతంగా ఉంటాయి. గేమ్ ఛేంజర్‌లో సాంగ్స్ పిక్చరైజేషన్ అయితే అద్దిరిపోయింది. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. రామ్ చరణ్ ఎలివేషన్స్ షాట్స్‌కి అయితే బాదిపడేశాడు. అయితే సాంగ్స్ మాత్రం.. విన్నప్పటి కంటే చూడ్డానికి చాలా బావున్నాయి. విజువల్ ట్రీట్‌గా అనిపిస్తాయి. జరగండి పాటలో కనిపించే విలేజ్ సెట్ కనువిందు చేస్తుంది. దోప్ సాంగ్ కూడా భారీ సెట్‌తో తీర్చిదిద్దారు. ఇక ఈ గేమ్ చేంజర్‌కు దిల్ రాజు పెట్టిన ప్రతీ పైసా తెరపై రిచ్‌గా కనిపిస్తుంది. శంకర్ విజన్, తిరు కెమెరా వర్క్, సాయి మాధవ్ బుర్రా మాటలు ఆలోచింపజేసేలా ఉంటాయి. జనాల్ని పొల్యూట్ చేసే చేయి.. జెండాకి సెల్యూట్ చేయకూడదు లాంటి పొలిటికల్ డైలాగ్‌లు పేలాయి. ఎడిటింగ్ ఇతర విభాగాల పనితీరు ఫర్వాలేదనిపించేలా ఉంది.
విశ్లేషణ :
అయితే ఏదో అద్భుతాన్ని ఆశించి.. గేమ్ ఛేంజర్‌కి వెళ్తే మాత్రం నిరాశ తప్పదు. కథ కూడా రొటీన్ ఫార్మేట్‌లోనే ఉంటుంది. ఆ రొటీన్‌కి తగ్గట్టుగా.. లాజిక్‌లు లేని చిత్ర విచిత్రాలు గేమ్ ఛేంజర్‌లో చాలానే ఉంటాయి. ముగింపు కూడా పరమరొటీన్ మాత్రమే కాకుండా వాస్తవ దూరంగా అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్‌లో మైనింగ్‌పై అప్పన్న పోరాటం.. పొలిటికల్ ఎంట్రీ.. జీరో బడ్జెట్ పాలిటిక్స్ కాన్సెప్ట్‌తో ఎదురైన సవాళ్లు ప్రతి సవాళ్లు డ్రామా తెరపై పండింది. ఎప్పుడైతే అప్పన్న ఎపిసోడ్ ముగిసిందో అప్పటి నుంచి కథనం గాడి తప్పింది. శానన సభ వ్యవస్థ, ముఖ్యమంత్రుల ఎంపిక నాటకీయంగా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో కొన్ని లాజిక్స్‌ను శంకర్ గాలికి వదిలేయడం మింగుడు పడని విషయం. కానీ మదర్ సెంటిమెంట్‌ను ఎలివేట్ చేసిన తీరు బాగుంది. ఓవరాల్‌గా గేమ్ ఛేంజర్.. ‘రికార్డ్స్ ఛేంజర్’ అని అనలేం. అలాగని ‘గేమ్ ఓవర్’ అని కూడా తీసిపారేయలేం. రాంచరణ్, సూర్య, అంజలి, శ్రీకాంత్ పెర్ఫార్మెన్స్‌తో చూసి మంచి అనుభూతిని పొందాలంటే.. థియేటర్‌లోనే చూస్తే థ్రిల్ ఉంటుంది. సంక్రాంతి పండుగ సమయంలో మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటింది. సామాన్య ప్రేక్షకుడికి ఇది రొటీన్ సినిమాగా అనిపిస్తుంది.