కరోనా బారిన పడి ప్రాణాలు విడిచిన ప్రముఖ నిర్మాత పోకూరి రామారావు
కరోనా మహమ్మారి రోజురోజుకూ విరుచుకుపడుతోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వేలసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడమే కాదు, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కొన్నాళ్ల లాక్డౌన్ అనంతరం ఇటీవల సినిమా, టీవీ షూటింగులకు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోయినా టీవీ సీరియల్స్, ఇతర షోలకు సంబంధించిన షూటింగులు జరుగుతున్నాయి. ఇటీవల టీవీ షూటింగుల్లో కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. సీరియల్స్‌లో నటిస్తున్న కొంతమందికి కరోనా సోకింది.
ఇక ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావు సోదరుడు పోకూరి రామారావు కరోనా కారణంగా శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. హైదరాబాద్ మణికొండలోని తన నివాసంలోనే పోకూరి రామారావు తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. ఈతరం ఫిలింస్ బేనర్లో పోకూరి బాబూరావు ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించారు. ఆ సినిమాలకు పోకూరి రామారావు సమర్పకుడిగా వ్యవహరించారు. నేటి భారతం, ఎర్ర మందారం, యజ్ఞం, రణం వంటి అనేక హిట్ చిత్రాలు ఈ తరం బ్యానర్ లో తెరకెక్కాయి. పోకూరి రామారావు మృతి పట్ల చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు.













