నార్త్, సౌత్ స్టార్స్ ని కలపబోతున్న వెబ్ సిరీస్..!?
ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం సినిమాలు, లేదంటే సీరియళ్లతోనే టైం గడిచిపోయేది. తర్వాత తర్వాత ఓటీటీ రూపంలో ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకి అతి చేరువ అయ్యిందని చెప్పాలి. ఇక కోవిడ్ తరువాత చాలా మార్పు వచ్చింది. డిజిటల్ ప్లాట్ఫార్మ్ ల ప్రాధాన్యత భారీగా పెరిగిపోయింది. సేఫ్టీ థింకింగ్ లో ప్రేక్షకులు కూడా థియేటర్లకు కంటే ఓటీటీ ప్లాట్ ఫామ్ లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనడంలో సందేహం లేదు.
ఈ నేపథ్యంలో ఓటీటీలకు భారీ గా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో వీక్షకుల్ని ఆకట్టుకునే క్రమంలో క్రేజీ స్టార్లతో వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ మరింతగా ఆకట్టుకునే ప్రమయత్నం చేస్తున్నాయి ఓటీటీ ప్లాట్ఫార్మ్స్. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సౌత్, నార్త్ స్టార్స్ ని కలుపుతూ ఓ క్రేజీ వెబ్ సిరీస్ కు శ్రీకారం చుట్టడం విశేషం.
రీసెంట్ గా క్రేజీ డైరెక్టర్ ఎస్. జె. సూర్యతో ‘వదంతి’ సిరీస్ ని నిర్మించడం జరిగింది ఈ సంస్థ. అది సక్సెస్ కావడంతో మరో క్రేజీ కాంబోలో అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ ని ప్రేక్షకులకి అందించడానికి సన్నాహాలు చేస్తుంది. తమిళ, తెలుగు భాషల్లోనే కాకుండా సౌత్ లో వెర్సటైల్ స్టార్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి, బాలీవుడ్ క్రేజీ హీరో షాహీద్ కపూర్ ల కలయికలో ‘ఫర్జీ’ అనే వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
సమంత, మనోజ్ బాజ్ పాయ్ లతో ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వంటి సంచలన సిరీస్ లని అందించిన రాజ్ అండ్ డీకె ఈ సీరీస్ ని రూపొందించారు. ఎటువంటి హడావిడి లేకుండా, సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఫిబ్రవరి 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లని శుక్రవారం సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు.
ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. స్టైలిష్ లుక్ లో గన్ పట్టుకుని విజయ్ సేతుపతి కనిపిస్తుండగా, రఫ్ లుక్ లో షాహిద్ కపూర్ కనిపిస్తున్న తీరు అభిమానులని ఆకట్టుకుంటోంది, అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కె కె మీనన్, రాశీఖన్నా, అమోల్ పాలేకర్, భువన్ అరోరా ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రల్లో నటించారని సమాచారం.. త్వరలో ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు.













