ఫ్రేస్టేషన్ మర్చిపోయి …ఫన్నీ ని ఎంజాయ్ చేసే ‘ఎఫ్ 2’ (సంక్రాంతి అల్లుళ్ళు)

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు: విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహరీన్
రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, నాజర్, రఘుబాబు, ప్రగతి, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించారు.
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఎడిటింగ్: తమ్మి రాజు
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : అనిల్ రావిపూడి
విడుదల తేదీ: 12.01.2019
పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ వంటి విజయాలతో మంచి ఫాంలో ఉన్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన మరో కామెడీ ఎంటర్‌టైనర్ ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రేస్టేషన్) టాగ్ లైన్ సంక్రాంతి అల్లుళ్ళు. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో భారీ పోటి మధ్య ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఇప్పటికే విడుదలైన మూడు సినిమాలకు డివైడ్ టాక్ రావటంతో ఎఫ్ 2 ఎలా ఉండబోతుందన్న ఆసక్తి నెలకొంది. చాలా కాలం తరువాత వెంకీ ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్‌లో కనిపించటం, వరుణ్ తేజ్ తొలిసారిగా ఫుల్ లెంగ్త్ ఫన్నీ రోల్ లో మల్టీస్టారర్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఎఫ్ 2 అందుకుందా.? సమీక్ష లో తెలుసుకుందాం….!
కథ :
వెంకీ (వెంకటేష్) ఓ ఎమ్మెల్యే (రఘు బాబు) దగ్గర పీఏగా పనిచేస్తుంటాడు. వెంకీకి అమ్మా నాన్న లతో పాటు అక్కచెల్లెల్లు, అన్నదమ్ములు కూడా లేకపోవటంతో సెల్ఫ్ రెస్పెక్ట్, భర్త పై పెత్తనం చేసే మనస్తత్వం ఉన్న హారిక తో (తమన్నా) పెళ్లి అవుతుంది. పెళ్లి తరువాత వెంకీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అప్పటి వరకు తనకు నచ్చినట్టుగా గడిచిపోతున్న వెంకీ జీవితం.. భార్య, అత్తమామల రాకతో నరకంగా తయారవుతుంది. హారిక చెల్లెలు హని (మెహరీన్). కాలేజ్‌లో చదువుకుంటున్న హనీని వరుణ్ యాదవ్( వరుణ్ తేజ్) ఇష్టపడతాడు. ఒరేయ్ నా మరదలితో పెళ్లి వద్దురా బాబూ అని వారిస్తున్నా వినకుండా వరుణ్, హనీతో పెళ్లికి రెడీ అయిపోతాడు. వరుణ్ జీవితం పెళ్లి కాకుండానే హనీ చేతుల్లోకి వెళ్లిపోతుంది. దీంతో వెంకీ, వరుణ్‌లలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఎదురింటి వ్యక్తి(రాజేంద్రప్రసాద్) చెప్పిన మాటలు విని, దాంతో వెంకీ -వరుణ్ తమ అత్త ఇంటివాళ్లకి బుద్ది చెప్పడానికి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం వారి జీవితాలనే మారుస్తుంది. అసలు వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏమిటి ? దానికి వీళ్ళ పై తమన్నా , మెహరీన్ ఎలా రివెంజ్ తీర్చుకున్నారు ? చివరకి ఈ జంటల మధ్య ఉన్న ఈగో ప్రాబ్లెమ్స్ ను ఎలా పరిష్కరించుకున్నారు? ఈ క్రమంలో వెంకీ – వరుణ్ ఎలాంటి సమస్యలను ఎదురుకున్నారు ? తిరిగి తమ భార్యలకు ఎలా దగ్గరయ్యారు..? అన్నదే మిగతా విషయాలు తెలియాలంటే వెండి తెర పై ఈ చిత్రం చూడాల్సిందే.
ఆర్టిస్ట్స్ పర్ఫామెన్స్ :
వెంకటేష్ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ఈ సినిమాకే హైలెట్ గా నిలిచారు. మళ్లీ మనకు ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాల్లోని తన కామెడీని గుర్తుకు తెస్తారు. ఈ సినిమాలో ప్రధానంగా వెంకీ, పెళ్లి తర్వాత ఫ్రస్ట్రేషన్ కి గురి అయ్యే సన్నివేశాల్లో గాని, వరుణ్ తేజ్ తో సాగే సన్నివేశాల్లో గాని, అలాగే క్లైమాక్స్ లో కూడా తనలోని కామెడీ యాంగిల్ తో మరియు తన మాడ్యులేషన్ తో వెంకీ బాగా అలరించారు. సినిమా అంతా తన భుజాల మీదే నడిపించాడు. కామెడీ పర్ఫామెన్స్, డైలాగ్ డెలివరీ, ఇలా ప్రతీ దాంట్లో వెంకీ అదరగొట్టాడు. మరో హీరోగా నటించిన వరుణ్ తేజ్ కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. నటన పరంగా మెప్పించినా.. తెలంగాణ యాసలో మాట్లాడేందుకు కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపించింది. కామెడీ పరంగా మాత్రం మంచి మార్కులే సాధించాడు. హారిక పాత్రలో తమన్నా తనదైన స్టయిల్లో ఆకట్టుకుంది. చాలా రోజుల తరువాత మెచూర్డ్ క్యారెక్టర్ లో తన నటనతో ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్‌లో మరో హీరోయిన్‌మెహరీన్ నటన కాస్త అతిగా అనిపించినా తరువాత తరువాత పరవాలేదనిపిస్తుంది. గ్లామర్ షోలో మాత్రం ఇద్దరు హీరోయిన్లు ఒకరితో ఒకరు పోటి పడ్డారు. ఇతర పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, ప్రగతి, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌లు తమ వంతుగా నవ్వించే ప్రయత్నం చేశారు.
సాంకేతిక వర్గం పని తీరు:
కామెడీని హ్యాండిల్ చేయడంలో ‘పటాస్’ నుంచే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని తనదైన మార్క్ కామెడీతో, డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న అనిల్ రావిపూడి మరోసారి ఫన్ అండ్ ఫస్ట్రేషన్ తో రచయితగా దర్శకుడిగా ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. కానీ ఆయన కథ కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే..బాగుండేది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు, వాటి పిక్చరైజేషన్ కూడా బాగున్నాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సినిమాలోని యూరప్ సన్నివేశాలన్నీ ఆయన కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. నిర్మాత దిల్ రాజు, శిరీష్ లక్ష్మణ్ లు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.
విశ్లేషణ :
వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న అనిల్ రావిపూడి ఈ పండక్కి ఓ మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కామెడీతో ఆకట్టుకున్నప్పటికీ.. మరియు ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చినప్పటికీ.. కథ మరియు సెకెండ్ హాఫ్ విషయంలో మాత్రం అనిల్ రావిపూడి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. సినిమా మొదటి భాగంలో ఉన్నంత కామెడీని.. సెకెండ్ హాఫ్ లో కంటిన్యూ చేయలేకపోవడం, సెకండాఫ్ స్టార్టింగ్ నుంచే బోరింగ్ గా అనిపించడం, కథకే ప్లాట్ పాయింట్ లాంటి ప్రకాష్ రాజ్ ట్రాక్ మరీ సినిమాటిక్ గా సాగడం, దీనికి తోడు సెకెండ్ హాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం వంటి అంశాలు సినిమాని బలహీనపరుస్తాయి. కథగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోయినా కట్టిపడేసే సన్నివేశాలతో కడుపుబ్బా నవ్వించాడు. ప్రతీ ఇంట్లో భార్య భర్తల మధ్య జరిగే రెగ్యులర్‌గా జరిగే గొడవలు, వాటి పరిణామాలు, పుట్టింటి వారి మాటలు ఇలా ప్రతీది ఎంతో ఫన్ క్రియేట్ చేసాడు.రచయితగానూ అనిల్ రావిపూడి ఫుల్ మార్క్ సాదించాడు. అనిల్ రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. అయితే వెంకీ తన కామెడీ టైమింగ్ తో, తన డైలాగ్ మాడ్యులేషన్ తో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. అలాగే వరుణ్ తేజ్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఆనిల్ రావిపూడి తన శైలి కామెడీతో, తన మార్క్ డైలాగ్ లతో కొన్ని సన్నివేశాల్లో చాలా బాగా ఎంటర్ టైన్ చేశాడు. మొత్తం మీద ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు కామెడీని మాత్రమే ఇష్టపడే వాళ్లకు మాత్రం బాగా నచ్చుతుంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.