Emraan Hashmi: బాలీవుడ్ కొత్తదనాన్ని మర్చిపోయింది
ఈ మధ్య ఓటీటీలో వచ్చే సినిమాలు, సిరీస్ లకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ కారణంతోనే ఓటీటీలో కంటెంట్ చూడ్డానికి ఆడియన్స్ కూడా బాగా ఉత్సాహం చూపిస్తున్నారు. రీసెంట్ గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన అడాల్సెన్స్(Adolesense) అనే బ్రిటీష్ వెబ్ సిరీస్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ ఈ సిరీస్ పై బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు రెస్పాండ్ కాగా, ఇప్పుడు ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi) మాట్లాడారు.
అడాల్సెన్స్ లాంటి కథను రూపొందిద్దామని బాలీవుడ్ లో ఎవరినైనా సంప్రదిస్తే మనల్ని పిచ్చోళ్లలా చూస్తారని, దానికి కారణం బాలీవుడ్ కొత్తదనాన్ని పూర్తిగా మర్చిపోవడమేనని ఇమ్రాన్ హష్మీ అన్నారు. బాలీవుడ్ రిస్క్ తీసుకోవడం మానేసిందని, ఎంత కొత్తగా ఉన్నప్పటికీ ఇలాంటి కంటెంట్ ను రూపొందించడానికి బాలీవుడ్ భయపడుతుందన్నారు.
నాలుగు ఎపిసోడ్స్ లో ఒక్కోదాన్ని ఒకే టేక్ లో షూట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారని, ఈ విషయాన్ని బాలీవుడ్ నిర్మాతలకు చెప్తే ఎపిసోడ్ షూటింగ్ మధ్యలో ఏదైనా తప్పు జరిగితే మళ్లీ ఫస్ట్ నుంచి షూట్ చేయాలంటారని, దానికి బడ్జెట్ ఎంతవుతుందో తెలుసా అని తిరిగి మనల్నే ప్రశ్నిస్తారని ఇమ్రాన్ హష్మీ అన్నారు. ఇలాంటివి తీయాలంటే ఎంతో ధైర్యం కావాలని, బాలీవుడ్ కొత్తదనానికి పూర్తిగా దూరమైందని, ఆల్రెడీ వచ్చిన సినిమాల్లోని కంటెంట్‌నే అటూ ఇటూ మార్చి సినిమాలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.






