రాజశేఖర్ ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న జీవిత!
దేశవ్యాప్తంగా తన పంజా విసురుతూ ఎంతోమందిని ఆస్పత్రి పాలు చేస్తున్న కరోనా తన ఉధృతిని ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది దీని బారిన పడ్డారు. కొందరు కొద్దిరోజుల్లోనే కోలుకొని సాధారణ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కొంతమంది మాత్రం దీర్ఘకాలం చికిత్స తీసుకోవాల్సి వస్తోంది. ఇటీవల హీరో రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక త్వరగానే కోలుకున్నారు. రాజశేఖర్, జీవిత మాత్రం ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇటీవల రాజశేఖర్ ఆరోగ్యం క్షీణించిందని, పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వచ్చాయి. దీనికంటే ముందు ఆయన కుమార్తె పొరపాటున చేసిన ట్వీట్ వైరల్గా మారింది. అయితే ఆమె తన తప్పును తెలుసుకొని మరో ట్వీట్ చేసింది. దీంతో ఆయన ఆరోగ్యంపై గందరగోళ పరిస్థితి నెలకొంది.
రాజశేఖర్ ఐసియులో ఉన్నారని, ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని ఓ పక్క, లేదు లేదు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని మరో పక్క వార్తలు వస్తుండడంతో అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. కుటుంబంలోని నలుగురికీ కరోనా సోకినా కుమార్తెలు ఇద్దరూ కోలుకోవడంతోపాటు ఇప్పుడు జీవిత కూడా పూర్తిగా కోలుకొని సాధారణ స్థితికి వచ్చారని తెలుస్తోంది. అయితే నిన్నటి వరకు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని, ఈరోజు మాత్రం నిన్నటి కంటే ఫరవాలేదు అనేది తాజా సమాచారం. ఆయన ఆరోగ్యం క్షీణించడానికి కారణం బ్లడ్లో క్లాట్స్ ఉండడమేనని డాక్టర్లు నిర్థారించారు. దానికి తగిన వైద్యం అందించేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. రక్తసరఫరాకు అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న చికిత్సను బట్టి చూస్తే మరో రెండు రోజుల్లో రాజశేఖర్ ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. రాజశేఖర్ ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దని, ఎప్పటికప్పుడు ఈ విషయాలను అందరికీ తెలియజేస్తామని జీవిత చెబుతున్నారు.













