దిల్ రాజు బ్యానర్ లో తర్వాతి సినిమా ఐకాన్
వేణు శ్రీరామ్ డైరక్షన్ లో వచ్చిన వకీల్ సాబ్ సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు అందరి కన్ను ఆయనపైనే పడింది. పింక్ రీమేక్ కు తెలుగు హంగులు దిద్ది, కమర్షియల్ అంశాలను జత చేసి ప్రేక్షకుల్ని మెప్పించిన వేణు శ్రీరామ్ తర్వాతి సినిమా ఏంటనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ ఎక్కువైంది. ఈ తరుణంలో స్క్రిప్ట్ దశలో ఆగిపోయిన ఐకాన్ కనబడుటలేదు సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
బన్నీ హీరోగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు రెండేళ్ల క్రితమే ఐకాన్ ను అనౌన్స్ చేశారు. కానీ ఎందుకో తెలీదు ఈ ప్రాజెక్ట్ మాత్రం సెట్స్ మీదకు రాకుండా ఆగిపోయింది. అదే టైమ్ లో పవన్ ను డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ మీద తన ఫోకస్ అంతా పెట్టాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఐకాన్ సినిమా మీద వేణు శ్రీరామ్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ తర్వాత పరిస్థితులన్నీ మారాయి.
ఐకాన్ ను త్వరలోనే పట్టాలెక్కించనున్నామని దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా దర్శకుడు వేణు శ్రీరామ్ తర్వాత కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్న దిల్ రాజు తాము వెంటనే చేయబోయే సినిమా ఐకాన్ అని వెల్లడించారు. నా మనసుకు నచ్చిన కథ అది. ఇమిడియేట్ గా మేం చేసే సినిమా ఐకాన్. వేణు స్టోరీ లైన్ చెప్పినప్పటి నుంచే ట్రావెల్ అయ్యాం. ఫుల్ స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది. వేరే కారణాల వల్ల సినిమా లేట్ అవుతూ వచ్చింది. మంచి కథ మా దగ్గరుంది. తప్పకుండా మంచి సినిమా అవుతుంది. త్వరలోనే ఈ సినిమాను మొదలుపెడతామని రాజు గారు చెప్పుకొచ్చారు. దీంతో ఐకాన్ సినిమాపై క్లారిటీతో పాటూ.. పుష్ప తర్వాత బన్నీ చేసేది ఐకాన్ సినిమానే అని తేలిపోయింది.













