ప్రభాస్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డ దీపికా పదుకొనె!
`బాహుబలి`తో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ అదే ఉత్సాహంతో `సాహో` సినిమా చేశాడు. కానీ, అది బెడిసి కొట్టింది. తెలుగులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే హిందీలో ఫర్వాలేదు అనిపించింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాపైనే ఇప్పుడు అందరి దృష్టీ ఉంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు ప్రభాస్. ఈ సినిమాను వైజయంతి మూవీస్ పతాకంపై సి.అశ్వినీదత్ నిర్మించనున్నారు. ఇది కేవలం పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదని, పాన్ వరల్డ్ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ సందర్భంలో పేర్కొన్నాడు. అందుకే ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని ఎంపిక చేస్తున్నారు. అందులో భాగంగా హీరోయిన్ కోసం ప్రస్తుతం అన్వేషణ కొనసాగుతోంది.
ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, అలియాభట్లను సంప్రదించింది చిత్ర యూనిట్. ప్రభాస్‌తో సినిమా అంటే మంచి అవకాశమే అని అలియాభట్ ఫీల్ అయినప్పటికీ ఆమెకు ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఓకే చెప్పలేకపోయింది. ఆర్ ఆర్ ఆర్, బ్రహ్మాస్త్ర వంటి భారీ చిత్రాలు చేస్తున్న ఆమెకు ప్రభాస్‌తో కలిసి నటించే అవకాశం లేకుండాపోయింది. ఇక దీపికా పదుకొనే విషయానికి వస్తే తన భర్త రణవీర్‌సింగ్ చిత్రం `83` తర్వాత మరో సినిమా ఒప్పుకోలేదు. నాగ్ అశ్విన్ చెప్పిన కథ నచ్చడంతో ప్రభాస్ సరసన నటించేందుకు ఒప్పుకుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా చేసేందుకు దీపిక పెట్టిన షరతులకు చిత్ర యూనిట్ షాక్ అయింది. అదేమిటంటే ఈ సినిమా హిందీ థియేట్రికల్ రైట్స్ తనకే ఇవ్వాలని చెప్పింది. `బాహుబలి`తో ప్రభాస్‌కు హిందీలో మంచి మార్కెట్ ఏర్పడింది. `సాహో` చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చినా బాలీవుడ్లో 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దీపిక ఈ కండీషన్ పెట్టిందని తెలుస్తోంది. మరి దీనిపై చిత్ర నిర్మాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఈ సినిమా షూటింగ్‌ను అక్టోబర్‌లో ప్రారంభించే అవకాశం ఉంది.













