‘అమరేంద్ర బాహుబలి అను నేను…’
ఒక భాషకు చెందిన హీరోలు చేసిన సినిమాలను, ఆ సినిమాలోని అతని పెర్ఫార్మెన్స్ను పరభాషా హీరోలు అప్రిషియేట్ చెయ్యడం అనేది మన దేశంలో హీరోల మధ్య ఉన్న స్నేహ పూర్వక వాతావరణాన్ని తెలియజేస్తుంది. ఇటీవలి కాంలో అంతటి పాపులారిటీ సాధించిన సినిమా ‘అల.. వైకుంఠపురములో’. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన గురించి, పాటల్లో బన్ని డాన్స్ గురించి కొంతమంది బాలీవుడ్ హీరోలు ప్రశంసించడం మనం చూశాం. అంతేకాదు ఈ సినిమాలోని పాటలకు ఎంతో మంది సెలబ్రిటీలు వీడియోలు చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ఇక ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెపక్కర్లేదు. వార్నర్, అతని భార్య క్యాండిస్, కుమార్తెతో పాటు ‘రాములో.. రాములా’, ‘బుట్టబొమ్మా..’ పాటలకు డాన్స్ చేసిన వీడియోలతో సోషల్ మీడియాలో అలరిస్తున్నాడు. అలాగే ‘పోకిరి’ సినిమాలో మహేష్ చెప్పిన ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ డైలాగ్తో మరోసారి వార్తల్లోకెక్కాడు.
తాజాగా ‘బాహుబలి’ అవతారం ఎత్తాడు వార్నర్. ‘అమరేంద్ర బాహుబలి అను నేను..’ అనే డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. అంతే కాదు.. ‘ఈ సినిమా పేరేమిటో చెప్పండి’ అంటూ ఓ క్వశ్చన్ విసిరాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. కేవం 20 నిమిషాల్లోనే 1.5 లక్షల మంది ఈ వీడియోను వీక్షించడం విశేషం.













