ఘనంగా దాసరి జన్మదినోత్సవం
ఇటీవలే తీవ్ర అనారోగ్యానికిలోనై, దానినుంచి కోలుకుని ఇంటికి వచ్చిన డాక్టర్ దాసరి నారాయణరావు తన 73వ జన్మదినోత్సవాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన స్వగృహంలో జరిగిన ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరై, ఆయన పూర్తిగా కోలుకుని మరిన్ని సినిమాలు తీయాలని ఆకాంక్షించారు. అభిమానులు తెచ్చిన కేక్‌ను కట్ చేసిన దాసరి దానిని తన మనమరాలుకు తినిపించారు. కార్యక్రమానికి హాజరైన అలనాటి నటి జమున ఆయన ఆర్యోగంగా వుండాలని ఆశీర్వదించారు. ఎందరో దర్శకులకు స్ఫూర్తి కల్గించిన దాసరిని పరుచూరి దంపతులు ఆత్మీయంగా పలుకరించారు. మా అసోసియేషన్ కార్యవర్గం శుభాకాంక్షలు తెలియజేసింది. తమ్మారెడ్డి భరద్వాజ, ఎం.ఎస్.రాజు, తనికెళ్ళ భరణి, శివ నాగేశ్వర రావు, కోదండరామిరెడ్డి, రవిరాజా పినిశెట్టి వంటి ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపగా, ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ కళాతపస్వి విశ్వనాథ్‌కు ఫాల్కే అవార్డు దక్కడం సముచి తమైందనీ, అయితే సమాజానికి ప్రేరణ కల్గించే ఎన్నో చిత్రాలు తీసి ఎందరో శిష్యుల్ని తయారు చేసిన దాసరిని కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరమని అన్నారు. పద్మ అవార్డుకు దాసరి అర్హుడని ఆయన అన్నారు. దాసరి జన్మదినోత్సవం సందర్భంగా చిరంజీవి, అల్లు అరవింద్, మోహన్‌బాబు ఆయను కలిసి ఆత్మీయంగా పలుకరించారు.













