చిరంజీవి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని ఈసారైనా సద్వినియోగం చేసుకుంటాడా?
తెలుగులో కంత్రి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన మెహర్ రమేష్ ఆ తర్వాత బిల్లా, శక్తి, షాడో వంటి సినిమాలు చేసినా ఏ ఒక్కటీ కమర్షియల్‌గా సక్సెస్ అవ్వలేదు. ఈ నాలుగు సినిమాలూ పెద్ద హీరోలతో బారీ బడ్జెట్‌తో చేసినా అవి అతని కెరీర్‌కి ఏమాత్రం ఉపయోగపడలేదు. దీంతో అతనితో సినిమాలు చేసేందుకు హీరోలెవరూ ముందుకు రాలేదు. 2013లో షాడో రిలీజ్ అయింది. ఇప్పటివరకు అతను మరో సినిమా చేయలేదు. తెలుగు కంటే ముందు కన్నడలో ఆంధ్రావాలా రీమేక్, ఒక్కడు రీమేక్ చేశాడు. అవి కూడా విజయం సాధించలేదు. డైరెక్టర్‌గా మెహర్ రమేష్ కెరీర్ ఇక ముగిసినట్టే అనుకుంటున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి మెహర్‌కి ఓ గొప్ప అవకాశం ఇచ్చాడు. తమిళ్లో అజిత్ హీరోగా నటించిన వేదాళం పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాను చిరంజీవి తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఆ సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యత మెహర్ రమేష్‌కి అప్పగించారు.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న ఆచార్య షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత వినాయక్ దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్‌ను చేయబోతున్నారు. జనవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత వేదాళం షూటింగ్ మొదలవుతుంది. అంటే ఆగస్ట్‌లో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. కథ ప్రకారం ఈ సినిమాను కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో చెయ్యాల్సి ఉంది. అందుకే ప్రస్తుతం మెహర్ రమేష్ లొకేషన్స్ వెతికే పనిలో పడ్డాడు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రలో సాయిపల్లవి నటించనుందనే వార్తలు వస్తున్నాయి. చిరంజీవికి ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించిన మణిశర్మ ఈసారి తన తనయుడు సాగర్‌కి ఆ బాధ్యతను అప్పగిస్తున్నాడు.
స్టార్ హీరోలతో నాలుగు భారీ చిత్రాలు చేసినా సక్సెస్‌ను సొంతం చేసుకోలేకపోయిన మెహర్ రమేష్‌కి ఇది ఒక గొప్ప అవకాశం. మెగాస్టార్ చిరంజీవి వంటి హీరో పిలిచి అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయమని, దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మెహర్ ఎంతవరకు సక్సెస్ అవుతాడనేది కీలకమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళడానికి చాలా సమయం ఉంది కాబట్టి స్క్రిప్ట్ విషయంలో ఎంతో కేర్ తీసుకొని పక్కాగా రెడీ చేసుకోవడానికి కృషి చేస్తున్నాడని సమాచారం.













