బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి వివాదానికి తెరదించిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి… నటసింహ నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో విశేషం ఏముంది? సినీ ప్రముఖులు ఒకరికొకరు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటారు కదా అని మీరు అనుకోవచ్చు. అయితే ఇప్పడు బాలకృష్ణకు చిరంజీవి బర్త్‌డే విషెస్ చెప్పడం విశేషమనే చెప్పాలి. ఎందుకంటే లాక్డౌన్ కారణంతో కొన్ని నెలలుగా షూటింగులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. షూటింగులను పునరుద్ధరించే క్రమంలో కొంతమంది సినీప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ను కలవడం, పరిశ్రమకు మేలు జరిగే కొన్ని అంశాల గురించి చర్చించడం జరిగింది. ఈ చర్చలకు తనను పిలవకపోవడంతో బాలకృష్ణ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు తీవ్రంగా స్పందించారు. ఈ వివాదం చాలా దూరం వెళ్లింది. చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఈ వివాదం దూరం పెంచుతుందని అందరూ భావించారు. ఈ క్రమంలో జూన్ 10 బాలకృష్ణ పుట్టినరోజు వచ్చింది. మరి బాలకృష్ణకు చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారా లేదా అని ఎంతో మంది ఆత్రుతగా ఎదురుచూశారు. మొదటి నుంచీ వివాదాలకు దూరంగా ఉంటూ అందర్నీ కలుపుకుపోయే మనస్తత్వం ఉన్న చిరంజీవి వివాదాలను పక్కన పెట్టి స్నేహ పూరిత వాతావరణంలో నందమూరి బాలకృష్ణకు మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఇద్దరి మధ్యా ఉన్న వివాదానికి తెరదించారు.
`60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు, ఇదే ఉత్సాహం, ఉత్తేజంతో, ఆయురారోగ్యాలతో వంద వసంతాల సంబరం కూడా జరుపుకోవాలని, అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను` అంటూ ట్విట్టర్ ద్వారా బర్త్‌డే విషెస్ తెలిపారు. బాలకృష్ణకు చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం అటు టాలీవుడ్‌లోనూ ఇటు ఇద్దరు హీరోల అభిమానుల్లోనూ ఆనందాన్ని నింపింది. చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఎప్పుడూ మనస్పర్థలు లేవు. ఇరు కుటుంబాల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణమే ఉంది. ఇరు కుటుంబాల్లో జరిగే శుభకార్యాలకు కుటుంబ సమేతంగా హాజరవుతుంటారు. గతంలో చిరంజీవి షష్టిపూర్తి జరిగినపుడు బాలకృష్ణ ఆ వేడుకకు హాజరై చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు బాలకృష్ణ షష్టిపూర్తి సంవత్సరంలోకి అడుగుపెట్టారు. బాలకృష్ణ షష్టిపూర్తి ఘనంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మిత్రుడి షష్టిపూర్తి వేడుకకు చిరంజీవి తప్పనిసరిగా హాజరవుతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా!













