సైలెంట్ గా మొదలెట్టిన బ్రహ్మ రాక్షస
చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ రిలీజ్ తర్వాత చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ తో కలిసి ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు బ్రహ్మ రాక్షస అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.
హనుమాన్ హిట్ తర్వాత దానికి సీక్వెల్ గా జై హనుమాన్ ఉంటుందని ప్రశాంత్ ముందే క్లారిటీ ఇచ్చాడు. దీంతో పాటూ రానున్న రోజుల్లో తన నుంచి మరిన్ని మల్టీవర్స్ కథలతో సినిమాలు రానున్నట్లు చెప్పాడు దీంతో ప్రశాంత్ ఇమేజ్ బాగా పెరిగిపోయింది. ఇదిలా ఉంటే బ్రహ్మ రాక్షస సినిమాను లేట్ చేయకుండా కుదిరినంత త్వరగా మొదలుపెట్టాలని చూస్తున్నారట మేకర్స్.
హైదరాబాద్ పరిసరాల్లోని ఓ సెట్ లో ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. ఈ సెట్ ను హనుమాన్ కోసం నిర్మించగా, బ్రహ్మరాక్షస కు సంబంధించిన ప్రాథమిక దృశ్యాలను షూట్ చేసేందుకు ఈ సెట్ ను వాడుకుంటున్నాడట ప్రశాంత్ వర్మ. అయితే ఇదంతా గ్లింప్స్ కోసం మాత్రమేనని రణ్వీర్ సింగ్ ఈ గ్లింప్స్ కోసం నాలుగు రోజుల కాల్షీట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. ముందుగా గ్లింప్స్ ను షూట్ చేసి సినిమాను అనౌన్స్ చేస్తే మూవీపై మంచి బజ్ నెలకొంటుందనేది మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మాతల ప్లాన్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వెల్లడి కానున్నాయి.













