మోక్షు డెబ్యూ కోసం మాస్ డైరెక్టర్?
నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఐదారేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ ఫలానా సినిమాతో, ఫలానా డైరెక్టర్ తో అంటున్నారు తప్పించి ఇప్పటివరకు తన సినీ అరంగేట్రంపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. బాలయ్య ఎక్కడికెళ్లినా ఈ మధ్య ఆయనకు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ప్రశ్న ఎదురవుతూనే ఉంది.
గతంలో మోక్షజ్ఞ ఆదిత్య 369 సీక్వెల్ తో వెండితెరకు పరిచయమవుతాడని, ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల ను కూడా బాలయ్య స్వయంగా రివీల్ చేశాడు. ఈ సినిమాకు తాను దర్శకత్వం వహిస్తాడా లేదా మరెవరైనా యంగ్ డైరెక్టర్ కు ఆ ఛాన్స్ ఇస్తాడా అనేది సందర్భాన్ని బట్టి అనౌన్స్ చేస్తానని బాలయ్య అన్నారు. ఆదిత్య 999 మ్యాక్స్ లో బాలయ్య కూడా ఓ కీలక పాత్ర చేస్తారని అప్పట్లో అన్నారు. కానీ అది వర్కవుట్ అవలేదు.
ఆ తర్వాత కొన్నాళ్లకు మోక్షజ్ఞ చిత్రానికి బోయపాటి దర్శకత్వం వహించే ఛాన్సుందని వార్తలొచ్చాయి. అంతేకాదు మోక్షజ్ఞ కోసం పలువరు దర్శకులు క్యూ లో ఉన్నారని కూడా మీడియాలో కథనాలొచ్చాయి. బోయపాటి, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్లు మోక్షజ్ఞ డెబ్యూ సినిమా కోసం కథలు సిద్ధం చేశారని ప్రచారం జరిగింది. కానీ వీళ్లలో ఎవరి పేరునూ బాలయ్య అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు మరోసారి బోయపాటి పేరు మోక్షజ్ఞ డైరెక్టర్ గా వినిపిస్తోంది. మోక్షు డెబ్యూ సినిమాకు బోయపాటి స్టోరీ రెడీ చేశాడని, ఇప్పటికే దీనిపై బాలయ్యతో చర్చిస్తున్నారని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజమున్నది తెలియాల్సి ఉంది.













