కార్తీక దీపం ధాటికి తట్టుకోలేక విలవిలలాడిపోతున్న బిగ్‌బాస్!
కరోనా ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో థియేటర్లు, పార్కులు వంటి వాటికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో జనం ఇళ్ళకే పరిమితం అయ్యే పరిస్థితి వచ్చింది. వారికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కోసం బుల్లితెరనే ఆశ్రయించాల్సి వస్తోంది. జనం టీవీలకే అంటిపెట్టుకొని ఉంటారు కాబట్టి బిగ్‌బాస్ సీజన్ 4 స్టార్ట్ చెయ్యడానికి ఇదే మంచి సమయం అని భావించిన నిర్వాహకులు కోవిడ్‌కి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షోను సెప్టెంబర్ 6న ప్రారంభించారు. ఈ షోతో టిఆర్పి రేటింగ్ ఒక్కసారిగా పెరిగిపోతుందని నిర్వాహకులు భావించారు. కానీ, జరిగింది మరొకటి. ఎవ్వరూ ఊహించని విధంగా బిగ్‌బాస్‌కి షాకిచ్చారు జనం. అయితే ఇది బిగ్‌బాస్ షో ఒక్కదానికే కాకుండా మిగతా కార్యక్రమాలపై కూడా ప్రభావం చూపింది. తెలుగులో టాప్ 10 షోస్‌లో కార్తీకదీపం సీరియల్ తొలి ఆరు స్థానాలను కైవసం చేసుకుంది. దీన్ని బట్టి ఆ సీరియల్‌కు ఎంత పాపులారిటీ వచ్చేసిందో అర్థం చేసుకోవచ్చు.
ఒకప్పుడు బిగ్‌బాస్ షో అంటే అందరూ ఎగబడి చూసేవారు. కానీ, ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆ ఆసక్తిగానీ, ఆ ఉత్సాహం గానీ లేదని అర్థమైపోతోంది. ఎందుకంటే ఓ పక్క ఓటీటీ వైపు చాలా మంది ఎట్రాక్ట్ అవుతున్నారు. అందులో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుండడంతో దాన్నే ఆశ్రయిస్తున్నారు. టీవీల్లో మాత్రం వారికి ఇష్టమైన కొన్ని టీవీ సీరియల్స్‌ను వీక్షిస్తున్నారు. బిగ్‌బాస్ కోసం ఎంటర్టైన్మెంట్ నెవర్ బిఫోర్ అని ఎంత పబ్లిసిటీ చేసినా ఈసారి ఈ షోను పట్టించుకోకపోవడం నిర్వాహకులను ఆలోచనలో పడేసింది. కార్తీక దీపం సీరియల్ 18 పాయింట్లతో ప్రథమస్థానంలో దూసుకుపోతోంది. ఈ సీరియల్ ధాటికి మిగతా కార్యక్రమాలు విలవిలలాడిపోతున్నాయి. ఆఖరికి న్యూస్ ఛానల్స్ రేటింగ్ కూడా దారుణంగా పడిపోయిందని తెలుస్తోంది. మరి బిగ్‌బాస్ షో నిర్వాహకులు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, షోను అందరికీ నచ్చే విధంగా ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.













