లాక్ తో లక్ ఆ తర్వాత “బిగ్” డౌన్
తెలుగులో ప్రతిష్టాత్మక రియాలిటీ షోగా స్టార్ చానెల్ అందిస్తున్న బిగ్‌బాస్ 4 క్రేజ్ అంతకంతకూ తీసికట్టు అన్నట్టుగా సాగుతోంది. నాగార్జున హోస్ట్‌గా అనేకానేక అడ్డంకులను దాటుకుంటూ..కుంటు కుంటూ ప్రారంభమైన ఈ షో.. పెద్దగా ఆసక్తి కలిగించని కంటెస్టెంట్స్ పేర్ల ప్రకటనతోనే తుస్సుమంది. ఆల్రెడీ అప్పటికే ఒకసారి హోస్ట్‌గా చేసిన నాగార్జునే మళ్లీ హోస్ట్‌గా వ్యవహరించనుండడం, హౌజ్ లోకి వచ్చేవారెవరూ చెప్పుకోదగ్గ సెలబ్రిటీలు కాకపోవడంతో ఈ షో మీద ముందే ఫ్లాప్ అంచనాలు వెల్లువెత్తాయి.
ఆరంభం అదుర్స్…
అయితే అనూహ్యంగా బిగ్‌బాస్ ప్రారంభమే అదిరింది. జీఈసీ ప్రైమ్ టైమ్స్ రేటింగ్స్ ప్రకారం చూస్తే… బాస్ సీజన్ 4 . తొలివారంలో 18.5 టీవీఆర్ రేటింగ్ సాధించి.. బిగ్ బాస్ చరిత్రలో రికార్డులు తిరగ రాసింది. .. సీజన్ 4 ప్రారంభంలో 18.5 రేటింగ్ సాధించింది. ఈ షోను ఆ టైమ్‌లో దాదాపుగా 4.5 కోట్ల మంది వీక్షించారు. అంటే తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ముగ్గురులోనూ ఒకరు బిగ్ బాస్ షో చూశారు. అదే విధంగా అప్పటికే నాని, ఎన్టీయార్ల కన్నా హోస్ట్‌గా అత్యధిక రేటింగ్స్ రాబట్టిన నాగార్జున 4 వ సీజన్లోనూ తన దూకుడు కొనసాగించి ఔరా అనిపించాడు. అలా బిగ్ బాస్ 4 కొన్ని రోజుల పాటు రేటింగ్ పరంగా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది.
7వారాల్లో.. నింగి నుంచి నేలకు..
ఇప్పటికి బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమై ఏడు వారాలు గడిచింది. ఈ 7వారాల్లో బిగ్ షో అనూహ్యంగా రేటింగ్స్ దిగ జార్చుకోవడం మొదలైంది. ముఖ్యంగా గడచిన 10 రోజులుగానైతే మరీ ఘోరంగా పడిపోయింది. వారాంతపు రోజుల్లోఅతి కష్టమ్మీద 11.00 రేటింగ్ దక్కించుకుంటున్న బిగ్ షో.. రెగ్యులర్ డేస్‌లో కేవలం 8.35 కి మాత్రమే పరిమితం అయ్యింది. ఇంత స్వల్ప వ్యవధిలో 10శాతానికి పైగా రేటింగ్ కోల్పోవడం అంటే బహుశా టెలివిజన్ రియాలిటీ షోస్ హిస్టరీలో ఇదొక రికార్డు కావచ్చునేమో…
అన్ “లక్”
ఈ సీజన్ బిగ్ బాస్ ఇంత డౌన్ ఫాల్ చవి చూడడానికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. హౌజ్ మేట్స్‌లో పెద్దగా సెలబ్రిటీలు లేకపోవడం అనేది నిజమే అయినప్పటికీ… తొలిరోజుల్లో అదే కంటెస్టెంట్స్‌తో షో కి పెద్ద రేటింగ్స్ వచ్చాయనేది గమనార్హం. అయితే రాన్రానూ ఆ ఆదరణను నిలబెట్టుకోలేకపోవడం షోకి మైనస్ గా మారింది. అప్పటికీ షోని మరింతగా యూత్‌కి దగ్గర చేయడానికి ముద్దులు, రొమాన్స్, ఎక్స్పోజింగ్ వంటి వాటి డోసు పెంచుతున్నా… అది కూడా మైనస్‌గానే మారుతూ వచ్చింది. మరోవైపు బిగ్ బాస్ ప్రారంభంలో లాక్ డవున్ పూర్తిగా ఎత్తివేయకపోవడం కూడా ఆ షో తొలి రోజుల్లో మంచి రేటింగ్ దక్కించుకోవడానికి కారణమైందని కొందరి విశ్లేషణ. ఆ తర్వాత దాదాపుగా అన్‌లాక్ పూర్తయిపోవడం, మరణాలు తగ్గిపోవడంతో కరోనా భయం కూడా తగ్గి జనం యధా విధిగా రొటీన్ పనుల్లో పడిపోవడంతో బిగ్ బాస్ కు డౌన్ ట్రెండ్ స్టార్టయిందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా ఇంకా ఎన్నో వారాలు ఉండగానే బిగ్ షో ఫ్లాప్ షోగా మారిపోతుండడాన్ని నివారించడానికి ఈ షోకి మరిన్ని ఆకర్షణలు జోడించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.













