బిగ్‌బాస్‌కి మంచి రేటింగే వచ్చింది.. మరి ఐపిఎల్ స్టార్ట్ అయిన తర్వాత..?
బిగ్‌బాస్ సీజన్ 4 మొదలై రెండు వారాలు అవుతోంది. ఇప్పటివరకు ఈ షోకి సంబంధించిన రేటింగ్స్ విషయంలో రకరకాల వార్తలు వచ్చాయి. అన్ని షోల కంటే ఈ షో వెనకబడి ఉందని చెప్పుకున్నారు. అయితే తాజాగా వచ్చిన రేటింగ్స్ చూస్తే షో సూపర్‌హిట్ అయినట్టుగా కనిపిస్తోంది. మా టీవీ యాజమాన్యం ఊహించిన దానికంటే మంచి రేటింగ్ వచ్చినట్లు అర్థమవుతుంది. 18.6 రేటింగ్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. గతంలో ఏ సీజన్ మొదటి ఎపిసోడ్‌కు రానంతగా ఈ సారి రేటింగ్ వచ్చింది. లాక్డౌన్ సమయం కావడం.. పెద్దగా ఎంటర్టైన్మెంట్ కూడా లేకపోవడం.. సినిమా థియేటర్స్ మూసేయడం అన్నీ బిగ్ బాస్ సీజన్ 4కి కలిసొచ్చాయి. దాంతో రేటింగ్స్ కూడా ఓ రేంజ్లో వచ్చాయి. నాగార్జున హోస్టింగ్ కూడా ఈ సీజన్‌కు బాగానే కలిసొస్తుంది.
తెలిసిన కంటెస్టెంట్స్ పెద్దగా లేకపోయినా కూడా ఎపిసోడ్ ఎపిసోడ్‌కు ఆసక్తికరమైన ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. దాంతో రానున్న రోజుల్లో రేటింగ్ మరింత బాగా వస్తుందని నమ్ముతున్నారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూసుకుంటే మూడో సీజన్‌తో పోలిస్తే నాలుగో సీజన్ చాలా బెటర్‌గా మొదలైంది. అయితే ఇదే జోరు మున్ముందు కొనసాగుతుందా లేదా అనేది అనుమానమే. ఎందుకంటే సెప్టెంబర్ 19 నుంచి ఐపిఎల్ సీజన్ షురూ కానుంది. ఒక్కసారి అది మొదలైతే కచ్చితంగా బిగ్ బాస్ రేటింగ్స్‌పై ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తుంది. ఈమధ్యకాలంలో క్రికెట్ అనేది ఎక్కడా జరగలేదు కాబట్టి ప్రేక్షకులు క్రికెట్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. పైగా ఐపిఎల్‌కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. దాన్ని తట్టుకొని బిగ్ బాస్ నిలబడగలదా అనేది పెద్ద డౌట్. గతంలో 8 గంటలకు మొదలైన ఐపిఎల్ ఈసారి 7.30 గంటలకే ప్రారంభం కాబోతోంది. దీంతో మ్యాచ్ జరిగిన మూడు గంటల సమయంలో మరో ఛానల్ ప్రోగ్రామ్స్ చూసే అవకాశం తక్కువ. మరి బిగ్‌బాస్ దీన్ని ఎలా అధిగమిస్తాడో, ఏ మేరకు రేటింగ్ సాధిస్తాడో చూడాలి.













