బాలీవుడ్ గోల్డ్‌మ్యాన్ బప్పిలహరి మృతి
అటు బాలీవుడ్‌లోనూ, ఇటు తెలుగు, తమిళం, కన్నడలోనూ చాలా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీలహరి ఇకలేరు. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన ముంబై లోని ఓప్రైవేట్ ఆసుపత్రిలో కన్నమూశారు. డిస్కో కింగ్ ఆఫ్ బాలీవుడ్, గోల్డ్‌మ్యాన్ బప్పీ మరణం తీరని లోటంటూ పలువురు సంతాపం ప్రకటించారు. తెలుగు సినీపరిశ్రమతో భారతీయ దిగ్గజ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీలహరికి విడదీయరాని అనుబంధం ఉంది. తెలుగులో అగ్రహీరోల సినిమాల్లో బప్పీలహరి ఎవర్ గ్రీన్ పాటలు అందించారు. కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు సినిమాలకు ఎక్కువగా బప్పీ లహరి పనిచేశారు. ఆ సినిమాలు ఎలా ఉన్నా అందులోని సంగీతం మాత్రం సూపర్ హిట్టయింది. బప్పీలహరి అనగానే ప్రసిద్ధ డిస్కో-ఎలక్ట్రానిక్ సంగీతం, ఒంటినిండా బంగారు ఆభరణాలు, గొలుసులు, కంకణాలు, వెల్వెట్ కార్డిగాన్స్, సన్ గ్లాసెస్‌తో ఒక స్పెషల్ స్టైల్ గుర్తు వస్తుంది.
1952 నవంబరు 27న కోల్‌కతాలో పుట్టారు బప్పీలహరి, ఆయన అసలు పేరు అలోకేష్ లహరి. 3 సంవత్సరాల వయస్సులో తబలా వాయించడం ప్రారంభించి అటు బాలీవుడ్‌ను, ఇటు సౌత్‌లో ముఖ్యంగా తెలుగు తమిళం,కన్నడ పరిశ్రమలో లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నారు. తన తుది శ్వాసవరకూ మ్యూజిక్ ప్రాణంగా బతికిన లెజెండ్ ఆయన. డిస్కో, ఎనర్జిటిక్ సాంగ్స్‌కు పెట్టింది పేరు బప్పీలహరి. డిస్కో డాన్సర్, నమక్ హలాల్, హిమ్మత్ వాలా, షరాబీ, డర్టీ పిక్చర్ లాంటి అనేక మూవీల్లోని పాటలతో బాలీవుడ్‌ను ఉర్రూతలూగించిన బప్పీ దా సింహాసనం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. బప్పీదా అనగానే సింహాసనం సినిమాలో ఆకాశంలో ఒక తార పాట గుర్తొస్తుంది. అలాగే బాలకృష్ణ రౌడీ ఇన్పెక్టర్, నిప్పురవ్వ , చిరంజీవి గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, స్టేట్ రౌడీ మూవీల్లోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే మోహన్ బాబుకు రౌడీగారి పెళ్లాం, పుణ్యభూమి నా దేశం, బ్రహ్మ లాంటి సినిమాలకు ట్యూన్స్ అందించారు బప్పీ. బప్పీ మ్యూజిక్ అయినా, పాటలైనా ఎప్పటికీ ఎవర్ గ్రీనే. డిస్కో, ఫాస్ట్ బీట్స్, వెస్ట్రన్, క్లాసిక్ మిక్డ్స్ ట్యూన్స్‌తో ఆడియన్స్ మైమరిచిపోయారు.
ముఖ్యంగా 70, 80 90వ దశకంలో తన సంగీతంతో సంచలనం సృష్టించారు. చివరగా 2020లో భాగి 3లోను, రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా సినిమాలో టైటిల్ సాంగ్ పాడారు. ఆయన మ్యూజిక్కు ఎలాంటి వారైనా స్టెప్స్ వేయాల్సిందే. ఐయామ్ ఏ డిస్కో డ్యాన్సర్ అంటూ డిస్కో సాంగ్స్‌తో యూత్‌ను ఉర్రూత లూగించారు.
1986లో 33 సినిమాలకు 180కి పైగా పాటలను రికార్డ్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. కేవలం ర్యాక్, ర్యాప్ సాంగ్స్ మాత్రమే కాదు ఆశా భోంస్లే ,లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ పాడిన ఎన్నో మధురమైన పాటలను కూడా ఆయన స్వరపరిచారు. 1983-1985 కాలంలో జితేంద్ర ప్రధాన హీరోగా నటించిన 12 సూపర్-హిట్ సిల్వర్ జూబ్లీ సినిమాలకు కంపోజ్ చేసి రికార్డ్ సృష్టించారు. 2014 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని శ్రీరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ తరపున పోటీచేసి ఓడిపోయారు.













