షూటింగ్స్ పై త్వరలోనే నిర్ణయం..బాలయ్య
కోవిడ్ మహమ్మారి బారి ని త్వరలోనే తరిమి కొడతామని టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రికి సంగారెడ్డికి చెందిన మహేశ్వరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ 1000 పిపిఇ కిట్స్, ఎన్95 మాస్కులను అందజేసింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు ముమ్మురమయ్యాయని త్వరలోనే వ్యాక్సిన్ రావచ్చునన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్లాస్మా బ్యాంకుల ద్వారా చాలా మంది ప్రాణాలు కాపాడుకోగలుగుతున్నామన్నారు. ప్రభుత్వాలు మరింత బాధ్యతా యుతంగా వ్యవహరించాలని, అలాగే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలతో తమని తాము రక్షించుకోవాలని ఆయన సూచించారు. అయితే కరోనా విషయంలో భయం వదిలి దానిని జయించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమ అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బదులిస్తూ సినిమా షూటింగ్స్‌కు అనుమతి లభించిన నేపధ్యంలో దీనిపై పరిశ్రమ పెద్దలంతా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.













