అమెరికన్ పోలీస్‌గా అంజలి!
అంజలి అమెరికన్ పోలీస్‌గా మారిపోయింది. నేరపరిశోధన మొదలుపెట్టింది. ఆమె చేస్తున్న ఇన్వెస్టిగేషన్ మతలబు ఏమిటో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. వివరాల్లో వెళితే అనుష్క మాధవన్, అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ దర్శకుడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర తొలి షెడ్యూల్‌ను ఇటీవలే అమెరికాలో చిత్రీకరించారు. ఈ సినిమాలో అంజలి పోలీస్ పాత్రలో కనిపించబోతున్నది. తలపై అమెరికన్ పోలీస్ టోపీ, కళ్లద్ధాలను ధరించి చిరునవ్వులు చిందిస్తున్న తన లుక్కు సంబంధించిన వర్కింగ్ స్టిల్‌ను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది అంజలి.
కెరీర్లో తొలిసారి పోలీస్ పాత్రలో అంజలి నటిస్తున్న చిత్రమిదే కావడం విశేషం. అమెరికన్ పోలీస్ క్యారెక్టర్ కావడంతో వారి భావవ్యక్తీకరణ, గన్స్‌ను ఉపయోగించే తీరు, నేరస్తులతో వ్యవహరించే విధానం ఈ అంశాలన్నింటిలో ప్రత్యేక శిక్షణ తీసుకొని సినిమాలో నటిస్తున్నట్లు అంజలి తెలిపింది. క్రాస్ ఓవర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్ సన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, ఇంగ్లీష్, మలయాళ భాషల్లో ఈ ఏడాది చివరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.













