అమితాబ్ బచ్చన్ ‘ఝున్డ్’ సినిమాకు తప్పని తిప్పలు
ఒక పక్క లాక్ డౌన్ వల్ల థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి కానీ సినిమాల పై వివాదాలు మాత్రం షరా మాములే విషయానికొస్తే అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఝున్డ్’ సినిమా విడుదలకు కేసు లో పడింది ఆ వివరాలు.
“నేను డా. నంది చిన్నికుమార్, (పరిశోధకుడు మరియు ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్, హైదరాబాద్) జుండ్ అనే హిందీ సినిమాను ఏ థియేటర్లలోనూ OTTఫ్లాట్ ఫామ్‌లలోనూ ఆడకుండా నిషేధించాలని కోరుతూ 18/5/2020 నాడు కోర్టులో ఒక కేసు వేసాను. ఈ కేసు 22/5/2020 నాటి ది హానేబుల్ XV అదనపు జిల్లా న్యాయవాది, మియాపూర్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినది. ఈ కేసులో జుండ్ రచయిత, దర్శక, నిర్మాత-నాగరాజు మంజులె, ప్రధాన పాత్రధారి అమితాబ్ బచ్చన్, విజయ్ బర్సె, అఖిలేష్ పాల్, మీను అరోరా, ప్రొడక్షన్ కంపెనీ: టి. సీరిస్ మరియు తాండవ్ ఫిల్మ్స్, నెట్‌ఫ్లిక్స్ మరియు అమేజాన్ ప్రైమ్ మొదలైనవారిని ప్రతివాదులుగా పేర్కొన్నాను.
ఈ కింద పేర్కొన్న ప్రతివాదులు తమ కౌన్సిల్‌తో వీడియో కాన్ఫరెన్సు ద్వారా పైన పేర్కొన్న కోర్టులో హాజరయ్యారు.
నాగరాజ్ ముంజెలె- జుండ్ సినిమా రచయిత, దర్శక నిర్మాత.
అమితాబ్ బచ్చన్- జుండ్ సినిమా ప్రధాన నటుడు
నెట్‌ఫ్లిక్స్
సూపర్ కాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ( ప్రొడక్షన్ కంపెనీ ఆఫ్ జుండ్)
భూషణ్ కుమార్ (టి సీరిస్ చైర్మన్ మరియు ఎం. డి.; జుండ్ చిత్ర నిర్మాత)
శివ చనాన ( జుండ్ చిత్ర సహ నిర్మాత మరియు టి సీరిస్ ఉపాధ్యక్షులు)
ప్రతివాదులు కౌంటర్ రిప్లైని దాఖలు చేసారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ కాపీరైట్ ఉల్లంఘన వివాదాన్ని న్యాయమూర్తి 28 మే, 2020కి వాయిదా వేసారు.
కేసు పూర్వాపరాలు:
నేను స్లమ్ సాకర్ చాంపియన్ అఖిలేష్ పాల్ జీవితాన్ని సినిమాగా తీద్దామని ఆయనకు సంబంధించిన కాపీ హక్కులను కొనుగోలు చేసాను. ఆయన డాన్/గ్యాంగ్‌స్టర్ స్లమ్ సాకర్ ఆటగాడిగా మారి భారత జట్టు తరపున కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించి, స్లమ్ సాకర్ ప్రపంచ కప్ ఆడిన క్రీడాకారుడు. ఆయన ఉత్తేజకరమైన జీవిత ప్రయాణం నాలో మరింత ఆసక్తిని రేకెత్తించింది. నేను స్క్రీన్ స్టోరీ, స్క్రీన్‌ప్లేను “స్లమ్ సాకర్” పేరుతో రాసుకొని, తెలంగాణ సినిమా రైటర్స్ అసోసియేషన్‌లో నమోదు చేసుకున్నాను. స్లమ్ సాకర్ మీద నా తొలి సినిమా కావడంతో దీనికి సంబంధించిన వార్తలు ముద్రణ, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఈ సినిమాను ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే కాకుండా ఇతర ప్రాంతీయ భాషల్లో తీసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని బలంగా కోరుకున్నాను.
జుండ్ సినిమా నిర్మాత నాగరాజు మంజులె అఖిలేష్ పాల్ కోచ్ అయిన విజయ్ బర్సె నుంచి అఖిలేష్ జీవితానికి సంబంధించిన హక్కులను సంపాదించుకున్నారు.
నేను అఖిలేష్ పాల్ నుంచి హక్కులను కొన్న తరువాత, అఖిలేష్ పాల్ ఒక లీగల్ నోటీసును నాగరాజ్ మంజులేకు పంపించాడు. దానికి సంబంధించిన ఒక కాపీని విజయ్ బర్సే, భూషణ్ కుమార్‌లకు పంపించాడు. నా పాత్రకు సంబంధించి ఏ విధమైన పోలికలు జుండ్ సినిమాలో ఉండకూడదని ఆయన ఆ కాపీలో పేర్కొన్నాడు. ఇదిలా జరుగుతుండగా కాపీరైట్ ఉల్లంఘనకు సంబంధించిన లీగల్ నోటీసులను అఖిలేష్ పాల్‌కు, జుండ్ సినిమా తయారీదారులకు నేను( డా. నంది చిన్నికుమార్) పంపిచాను. అఖిలేష్ పాల్ తన కాపీ రైట్లను జుండ్ సినిమా కోసం నాగరాజ్ మంజులేకు అమ్మానని చెబుతూ లీగల్ నోటీసు రూపంలో నాకు సమాధానాన్ని ధృవీకరించారు. అఖిలేష్ పాల్ నుంచి ఎటువంటి హక్కులను కొనుగోలు చేయలేదని జుండ్ నిర్మాతలు కొట్టిపారేస్తున్నారు. కానీ, జుండ్ సినిమా దర్శకుడు నాగరాజు మంజులే, ఆ చిత్ర నిర్మాత నాతో జరిపిన ఫోన్ సంభాషణల్లో జుండ్ సినిమా కోసం అఖిలేష్ పాల్ నుంచి హక్కులను కొన్నామని చెప్పారు. వీటికి సంబంధించిన ఆధారాలు ఆడియో రికార్డింగ్స్ రూపంలో నా దగ్గర ఉన్నాయి.
జుండ్ సినిమా తయారీదారులకు కాపీరైట్ ఉల్లంఘణకు సంబంధించి నేను అందించిన లీగల్ నోటీసులను మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. జుండ్ సినిమాను OTT ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేయకుండా ఉండటానికి సంబంధించి జుండ్ నిర్మాతలకు లీగల్ నోటీసులు ఇచ్చాను. వారికి ఆ విషయాన్ని గూర్చి పదే పదే కోర్టు గుర్తుచేసాను. అయినప్పటికీ పైన పేర్కొన్న జుండ్ ప్రతివాదులు నా కాపీ రైట్లను, చట్టపరమైన హక్కులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్టు అర్థమవుతోంది. నా కాపీరైట్సును రక్షించుకోవడానికి అనివార్యమైన సందర్భంలో నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. న్యాయవ్యవస్థ నాకు న్యాయం చేస్తుందనే సంపూర్ణ నమ్మకముంది.
నేను ఇంతకుముందు కూడా ‘బిగిల్’ అనే తమిళ చిత్ర ప్రధాన పాత్రధారి కాపీరైట్ ఉల్లఘించినట్టు పేర్కొంటూ, బిగిల్ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాకుండా కోర్ట్ ద్వారా ఆర్డర్‌ను విజయవంతంగా తీసుకురాగలిగాను. తరువాత ఆ వివాదం ఇరు పార్టీల మధ్య కోర్టుకు వెలుపలే పరిష్కరించబడింది.
షార్ట్ బయోడాటా
నేను సినిమా రంగంపై పరిశోధన చేసి, తులనాత్మక సాహిత్య శాఖ, హైదరాబాద్ విశ్వవిద్యాలయంనుంచి పిహెచ్.డి పట్టాను తీసుకున్నాను. నేను రెండు సార్లు ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించే ప్రపంచ సాహిత్య సదస్సులో పాల్గొని, ఇండియన్, ఆసియా మరియు ఇతర దేశాలకు చెందిన సినిమాలపై పరిశోధన పత్రాలను సమర్పించాను. నేను టాలెంట్ కాంపస్ ఇండియ అలుమ్ని, ఇనిషియేటివ్ ఆఫ్ బెర్లినేల్ టాలెంట్ కాంపస్ మరియు బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గా ఉన్నాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయి లఘు చిత్రాలకు రచయితగా, దర్శక, నిర్మాతగా పనిచేసాను”.
ఇన్ ది కోర్ట్ ఆఫ్ ది హానేబుల్ XV అదనపు జిల్లా న్యాయవాది, మియాపూర్, రంగారెడ్డి జిల్లా.
డా. నంది చిన్నికుమార్
పరిశోధకుడు,
ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్, హైదరాబాద్.
(ఈ ప్రెస్ నోట్ పి ఆర్ ఓ సురేష్ కొండి ద్వారా మాకు అందినది.)













