రివ్యూ : వినోదం కోసం ‘అమర్ అక్బర్ ఆంటోనీ

తెలుగుటైమ్స్ .నెట్ రేటింగ్ : 2.5/5
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
పంపిణి : ఎరోస్ ఇంటర్నేషనల్
నటీనటులు : రవితేజ, ఇలియాన డి క్రూజ్, సునీల్, విక్రమ్ జిత్ విర్క్, అభిమన్యు సింగ్, సాయాజీ షిండే, తరుణ్ అరోరా, సత్య, వెన్నెల కిషోర్, ఆదిత్య మీనన్, శ్రీనివాస్ రెడ్డి, రాజీవ్ అంకుర్ సింగ్, జయ ప్రకాష్ రెడ్డి, తనికెళ్ళ భరణి, రఘు బాబు, శుభలేఖ సుధాకర్, రవి ప్రకాష్, భరత్ రెడ్డి తదితరులు.
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్, ఎడిటర్ : ఎం ఆర్ వర్మ
సంగీతం : యస్ తమన్, పాటలు: రామ జోగయ్య శాస్ట్రీ, విశ్వ, బాలాజీ
కథ: శ్రీను వైట్ల, వంశి రాజేష్ కొండవీటి
నిర్మాతలు : నవీన్ యర్నెని, వై రవి శంకర్, మోహన్ చెరుకూరి (సివియమ్)
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శ్రీను వైట్ల
విడుదల తేదీ: 16.11.2018
రాజా ది గ్రేట్ సినిమా తరువాత మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ, ఇటీవల కాలం లో సక్సెస్ లేక ఉన్న శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘అమర్ అక్బర్ ఆంటొని’. ఈ సినిమాతో చాలా కాలం తరువాత గోవా బ్యూటి ఇలియానా టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తోంది. మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై హీరో, హీరోయిన్, దర్శకుడు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి అమర్ అక్బర్ ఆంటొని.. ఆ అంచనాలను అందుకుందా..? రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసిందా..? ఇలియానా రీ ఎంట్రీలో ఎంత మేరకు ఆకట్టుకుంది.?
కథ :
ఆనంద్ ప్రసాద్, సంజయ్ మిత్రా ఇద్దరు ప్రాణ స్నేహితులు. న్యూయార్క్‌లో ఫిడో ఫార్మా పేరుతో కంపెనీని స్థాపించి మిలియనీర్స్‌గా ఎదుగుతారు. ఆనంద్ ప్రసాద్ తన కొడుకు అమర్ (రవితేజ)ను, సంజయ్ మిత్రా కూతురు ఐశ్వర్య (ఇలియానా)కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. తన కంపెనీలో ఉద్యోగస్తులుగా ఉన్న అరోరా(తరుణ్ అరోరా), సబూ మీనన్ (ఆదిత్య మీనన్), విక్రమ్ తల్వార్ (విక్రమ్‌జీత్), రాజ్ వీర్‌ల నిజస్వరూపం తెలియని ఆనంద్, సంజయ్‌లు కంపెనీలో షేర్స్ ఇచ్చి వారిని భాగస్వాములుగా చేసుకుంటారు. పార్టనర్స్ అయిన వెంటనే ఆనంద్ ప్రసాద్, సంజయ్ మిత్రాల కుటుంబాలను పూర్తిగా అంతం చేయడానికి ప్లాన్ చేస్తారు ఆ నలుగురు. కానీ వారి కుటుంబానికి నమ్మకస్తుడైన జలాల్ అక్బర్(షాయాజీ షిండే) సాయంతో అమర్, ఐశ్వర్యలు తప్పించుకుంటారు. తప్పించుకున్న అమర్ 14 ఏళ్ల తరువాత తిరిగి వచ్చి ఎలా పగ తీర్చుకున్నాడు.? తల్లిదండ్రులు చనిపోయిన తరువాత అమర్, ఐశ్వర్యల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది..? ఈ కథలో మరి అక్బర్, ఆంటొనిలు ఎవరు..? అన్నదే మిగతా కథ.
ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్:
రవితేజ తన ఎనర్జీ పెర్ఫార్మన్స్ తో పాటు తన టైమింగ్ తో కూడా మరో సారి ఆకట్టుకున్నాడు. ఇక లుక్స్ పరంగా గత తన సినిమాలలో కంటే.. ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చాలా కాలం తరువాత తెలుగు లో చేసిన ఇలియానా చాలా బాగా నటించింది. పూజ పాత్రలో తన అందంతో పాటు తన అభినయంతో కూడా మెప్పిస్తోంది.. అలాగే కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు బాగున్నాయి. మరో ముఖ్య పాత్రలో కనిపించిన సునీల్ కూడా తన టైమింగ్ తో అక్కడక్కడ నవ్విస్తాడు. అలాగే జూనియర్ పాల్ గా నటించిన కమెడియన్ సత్య కామెడీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఇక ఇతర కామిక్ పాత్రల్లో కనిపించిన శ్రీనివాస్ రెడ్డి, రఘు బాబు, వెన్నెల కిషోర్, జయ ప్రకాష్ రెడ్డి తమ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో కొన్నిచోట్ల నవ్వించే ప్రయత్నం చేసారు. మిగతా నటులు తమ పాత్రల మేరకు నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
దర్శకుడు శ్రీను వైట్ల మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ, ఆ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. తమన్ అందించిన పాటలు పరవాలేదనిపించినా నేపథ్య సంగీతం బాగుంది. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫి. ప్రతీ ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా, అందంగా, లావిష్‌గా కనిపిస్తుంది. ఇక యమ్ అర్ వర్మ ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. కథనాన్ని ఇంకా సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
విశ్లేషణ:
దర్శకుడు శ్రీను వైట్ల ఐడెంటిటీ డిజార్డర్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, అయినా చాలా రోజులుగా సరైన సక్సెస్ లేక ఇబ్బందుల్లో ఉన్న దర్శకుడు శ్రీను వైట్ల ఓ భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావటంతో ఈ సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఏర్పాడ్డాయి. అయితే ఆ అంచనాలు శ్రీను వైట్ల ఏ మాత్రం అందుకోలేకపోయాడు. ఓ మామూలు రివేంజ్ డ్రామా కథకు లావిష్ కోసం న్యూయార్క్ బ్యాక్ డ్రాప్ తీసుకొని దర్శకుడు తయారు చేసుకున్న కథనం ఆసక్తికరంగా అనిపించదు. కథలోని మెయిన్ ఎమోషన్ బలంగా ఎలివేట్ కాకపోవడం, కథనం ఇంట్రస్టింగ్ గా సాగకపోవడం, కామెడీ కూడా పూర్తిగా ఆకట్టుకొన్నే విధంగా లేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. అక్కడక్కడా కామెడీ పరవాలేదనిపించినా పూర్తిస్థాయిలో ఆకట్టుకునేలా లేదు. తెర నిండా కమెడియన్లు కనిపిస్తున్నా చాలా సన్నివేశంలో కామెడీ కావాలని ఇరికించారన్న భావన కలుగుతుంది. చాలా సన్నివేశాలు ఆడియన్స్ ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. మరి ఇలాంటి చిత్రం ప్రేక్షకులని ఎంతవరకు అలరిస్తుందో వేచి చూడాలి.