అఖిల్ తో యువి నో ఛేంజ్
ఏజెంట్ సినిమాపై అటు అక్కినేని అభిమానులు, ఇటు సినీ అభిమానులతో పాటూ అఖిల్ కూడా భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమాతో తను కోరుకున్న విజయం వస్తుందని అంచనా వేసుకున్నాడు. కానీ ఏజెంట్ సినిమా రిలీజ్ అయ్యాక అది కేవలం అఖిల్ కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ హిస్టరీలో ఉన్న అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా మిగిలింది.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో అఖిల్, తన తర్వాతి సినిమా గురించి మట్లాడుతూ, ఏజెంట్ ఇచ్చిన హై వల్ల తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తెలియక అయోమయంలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఏజెంట్ రిలీజ్ కు ముందు అఖిల్ ఈ మాట పాజిటివ్ గానే అన్నప్పటికీ, ఇప్పుడు రిజల్ట్ చూశాక అఖిల్ అన్న మాటలను గుర్తు చేసుకుని మరీ ఒక్కొక్కరు ఒక్కో మాట అంటున్నారు.
ఇదిలా ఉంటే ఏజెంట్ తర్వాత అఖిల్ పాన్ ఇండియన్ హీరో అయిపోతాడనుకుని అఖిల్‌తో ఓ సినిమా చేయడానికి యువి క్రియేషన్స్ అనుకుంది. అనిల్ అనే కొత్త డైరెక్టర్ ని ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేయాలనుకున్నారు. కానీ ఏజెంట్ రిజల్ట్ చూశాక యువి ఈ సినిమాను కంటిన్యూ చేస్తుందా అని అందరిలో సందేహాలేర్పడ్డాయి.
అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ యువి తమ ఆలోచనను ఏ మాత్రం మార్చుకోకుండా, ముందు అనుకున్న ప్రకారమే సినిమాను ప్లాన్ చేసే పనిలో ఉందట. ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని చూడటమే కాకుండా దాని కోసం ధీర అనే టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. ఏజెంట్ రిలీజ్ కు ముందే ఈ సినిమా కోసం అఖిల్ లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్‌గా అనౌన్స్మెంట్ రానుంది.













