ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవగన్ క్యారెక్టర్ ఏంటంటే..
రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కీలకపాత్ర చేస్తున్న విషయం విదితిమే. ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు ధీటుగా అజయ్ క్యారెక్టర్ ను రాజమౌళి డిజైన్ చేశాడు. దానికి సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది కూడా. ఈ సినిమాలో అజయ్ రోల్ ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటివరకు అనేక వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే అజయ్ పుట్టినరోజు కానుకగా ఫస్ట లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది యూనిట్. శత్రు మూకలు ఆయన్ని చుట్టుముట్టి తుపాకులు ఎక్కుపెట్టగా, లోడ్ ఎయిమ్ షూట్ అంటూ గంభీరమైన వాయిస్ తో అజయ్ లుక్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవగన్ క్యారెక్టర్ పై పడింది.
కేవలం రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ తోనే అజయ్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో తెలుస్తుంది. కాకపోతే ఈ మోషన్ పోస్టర్ లో అతని క్యారెక్టర్ నేమ్ ను రివీల్ చేయలేదు. అందులోని వాయిస్ ని బట్టి ఇందులో ఆయన బ్రిటీష్ వారికి తుపాకులని గురి పెట్టడానికి సైన్యాన్ని రెడీ చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లకు గురువుగా మారతాడని అంటున్నారు. అజయ్ కు జోడీగా శ్రియా శరణ్ నటించనుందని టాక్.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ కనిపించనున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తుండగా, కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.













