Aishwarya Rai: తన ఫోటోలు వాడుతున్నారంటూ కోర్టుకెళ్లిన ఐశ్వర్య

సెలబ్రిటీలకు ఉండే క్రేజ్, ఫేమ్ ను వాడుకుంటూ పలు సంస్థలు తమ బ్రాండ్ వాల్యూను పెంచుకుంటూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అలా బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ చేసినందుకు గానూ ఆయా సంస్థలు ఆ సెలబ్రిటీలకు కొన్ని కోట్లలో ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ మరికొందరు మాత్రం సెలబ్రిటీల అనుమతి లేకుండా వారి ఫోటోలను తమ బ్రాండ్ల కోసం వాడుతూ ఉంటారు.
అయితే ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్(Aishwarya Rai). సినిమాలతో పాటూ పలు బ్రాండ్లకు ఎండార్స్‌మెంట్స్ చేసే ఐశ్వర్య పేరుని, ఫోటోలను కొందరు ఎలాంటి పర్మిషన్ లేకుండా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేయగా దానిపై జస్టిస్ తేజస్ కరియా(tejas Kariya) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
కొన్ని ఆన్‌లైన్ సంస్థలు ఐశ్వర్య ఫేమ్ ను దారుణంగా దెబ్బతీస్తున్నారని, ఏఐ సాయంతో ఐశ్వర్య ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల ప్రయోజనాల కోసం వాడుతున్నారని, ఆమె ఫోటోలను టీ షర్టులపై ముద్రించి వాటిని అమ్ముతూ డబ్బు సంపాదిస్తున్నారని, ఐశ్వర్య నేషన్ వెల్త్(aishwarya nation wealth) అనే ఓ సంస్థ తమ లెటర్‌హెడ్ పై ఐశ్వర్య ఫోటోను ప్రింట్ చేసి ఆ సంస్థకు ఐశ్వర్యను చైర్‌పర్సన్‌గా చూపించిందని ఐశ్వర్య తరపున లాయర్ కోర్టుకు వివరించగా, వాదనలు విన్న కోర్టు వివిధ ప్రయోజనాల కోసం ఐశ్వర్య ఫోటోలను వాడుతున్న వెబ్‌సైట్స్ పై ఇంజక్షన్ ఆర్డర్లను జారీ చేస్తామని చెప్పింది.