గుంటురు యువతిని ట్రాప్ చేసి ‘లవ్ జిహాద్’
నటి కరాటే కళ్యాణి సాయంతో గుంటూరు ఎస్పీని కలిసిన బాధిత యువతీ
హిందూధర్మ పరిరక్షణకు తన వంతుగా గొంతు వినిపిస్తున్న నటి కరాటే కళ్యాణి. ఇటీవల ఓ పాస్టర్ చేతిలో మోసపోయిన మహిళకు మద్దతుగా నిలిచింది. తాజాగా గుంటూరులో మరో యువతి లవ్ జిహాద్ పేరుతో మోసపోగా.. కరాటే కళ్యాణి సాయంతో గుంటూరు ఎస్పీని కలిసింది. కులం వేరు.. మతం వేరు.. అయినా నువ్వంటే నాకు ఇష్టం అని ఆమె వెంటపడ్డాడు.. ఆమెను ట్రాప్‌లోకి దించి ప్రేమ పేరుతో అనుభవించాడు. నీ కోసం నా మతం మార్చుకుంటా అని మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. తీరా ఇంటికి తీసుకుని వెళ్లి ఆమెను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి చిత్ర హింసలకు గురిచేశాడు. మూడేళ్లు పాటు నరకం అనుభవించి ఆ యువతి వాళ్ల చెర నుంచి విడిపించుకుని బయటకు వచ్చింది. నటి కరాటే కళ్యాణి సాయంతో గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది.
యువతి ఫిర్యాదు ప్రకారం.. గుంటూరు ఏటీ అగ్రహారం ఎనిమిదో లైన్‌కు చెందిన యువతి హరికథపై ఉన్న ఆసక్తితో 2018లో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి వెళ్ళింది. అక్కడే కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన యువకుడు అహ్మద్ తషీఫ్తో పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారింది. ఆ తరువాత ఆమెకు మాయమాటలు చెప్పి 2019లో లాడ్జికి తీసుకుని వెళ్లి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేశాడు.. వాటిని వీడియోలు తీసి.. విషయం బయటకు చెప్తే వీడియోలు బయటపెడతానని తనపై పలు మార్లు అత్యాచారం చేశాడని చెప్పింది ఆ యువతి. ఈ ఇష్యూపై గురువారం నాడు గుంటూరులో మీడియాతో మాట్లాడిన కరాటే కళ్యాణి.. ‘ఈ అమ్మాయి పేరు దివ్య. నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఆమె గురించి నేను ఇంత ఇంట్రస్ట్ తీసుకుని గుంటూరు వరకూ వచ్చాను అంటే.. ఈ అమ్మాయి హరిదాసురాలు. నేను కూడా హరికథ చెప్తాను. హరికథా పీఠం నాకు ఉంది. నాలాగే ఆమె కూడా హిందూ ధర్మం కోసం పాటుపడుతుంది. ఇలాంటి అమ్మాయి కూడా లవ్ జిహాద్‌కి గురికాబడింది. లవ్ జిహాద్ అనేది చాలా ఎక్కువైపోయింది. అహ్మద్ తషీఫ్ అనే అబ్బాయి ఈ అమ్మాయిని ట్రాప్ చేశాడు.. పెళ్లి చేసుకుని మూడు నెలల్లోనే నరకం అంటే ఏంటో చూపించాడు. ఈ అమ్మాయికి న్యాయం జరిగేవరకూ మేం పోరాడతాం. ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థలు ఈ అమ్మాయికి న్యాయం చేయాలని నాతో పాటు ఇక్కడికి వచ్చాయి. ఇది ఒక్కరి సమస్య కాదు.. అందరి సమస్య కాబట్టి.. ఈ అమ్మాయిని మోసం చేసి మూడు నెలలు నరకం చూపించిన ఆ వెధవను మూడు చెరువులు నీళ్లు తాగించే వరకూ వదిలిపెట్టేది లేదు. హరినామస్మరణ చేసే ఈ అమ్మాయి నోటి వెంట.. అల్లా అని చెప్పించి బలవంతంగా మత మార్పిడి చేసి నరకం చూపించారు వీటన్నింటికీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పింది కరాటే కళ్యాణి.













