వచ్చే ఎన్నికల్లో రాజకీయాల్లోకి వస్తా : సుమన్
వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేస్తానని బాహుభాషా నటుడు సుమన్ వెల్లడించారు. రాజకీయాల్లోకి రావాలని ప్రస్తుతం ఉన్న పార్టీలతో పాటు అభిమానుల నుంచి ఎంతో ఒత్తిడి ఉంది. అయితే సినిమా షూటింగ్లతో బిజీగా
ఉండటంతో ఏ నిర్ణయాన్ని తీసుకోలేక సందిగ్ధంలో ఉన్నాను అని సుమన్ పేర్కొన్నారు. బెంగళూరు వచ్చిన సుమన్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయం అనేది జీవితాంతం ఉంటుందని, సినిమా రంగంలో సేవలందించేందుకు పరిమిత సమయమే ఉంటుందన్నారు. కర్ణాటకలో తనను జేడీఎస్లో చేరాలని ఆ పార్టీ నాయకులు కోరారని, మంగళూరు జిల్లా బంట్వాల్ నుంచి పోటీ చేయాలని కోరినట్లు తెలిపారు. అయితే ఏ పార్టీకి ఇప్పటివరకు తన ఆమోదం తెలపలేదన్నారు. సమయం వచ్చినప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలో కూడా తనకు అభిమానులున్నారని, వారందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే రాజకీయ ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటానని అన్నారు.













