అలాంటి పార్టీయే కేంద్రంలో అధికారంలోకి రావాలి
ఈ దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే తాము చేసిన పనులను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారని, ఎంతో కమిట్మెంట్ ఉన్న అలాంటి పార్టీయే కేంద్రంలో అధికారంలోకి రావాలని నటుడు, బెంగుళూరు దక్షిణ లోక్‌సభ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి ప్రకాష్ రాజ్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ పార్టీలో ఉన్నప్పటికీ దేశం కోసం ఆలోచించే వారిని పట్టుకోవాలని అన్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చాలా అద్భుతంగా పని చేస్తోందని కితాబిచ్చారు. వాళ్ల ఆలోచనలు, నిర్ణయాలు తనకు బాగా నచ్చాయని అందుకే ఆప్‌కు మద్దతుగా ఢిల్లీలో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్నికలు జరగాలి కానీ, ఎవరినో కించపర్చడానికి కాదని, పార్లమెంట్లో ప్రజా గొంతుక వినిపించాలంటే క్రేజీవాల్ లాంటి వారు పార్లమెంటుకు వెళ్లాలని అన్నారు.













